Komaram Bheem | Telangana | Adilabad | విడుదలకు సిద్ధమైన "కొమరమ్ భీమ్"
WD
అడవిలో పుట్టి, అడవిలో పెరిగి అడవి బిడ్డల కష్టాలను అనుభవించిన అమాయక గిరిజనుడు సహజ పరిణామక్రమంలో మహానాయకుడిగా ఎదిగిన ఆదర్శప్రాయుడి జీవితాన్ని సినిమాగా తీయడం, దానికి నంది అవార్డుతోపాటు అంతర్జాతీయ ఆసియా చలనచిత్రోత్సవంలో ప్రశంసలు రావడం ఆనందించదగ్గ విషయమని చిత్ర దర్శకుడు అల్లాణి శ్రీధర్ తెలియజేశారు.
మంగళవారం ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నో వ్యయప్రయాసలనోర్చి తీసిన ఈ చిత్రాన్ని మనవారు చూడలేకపోయారనే కించిత్ బాధ ఉన్నా... ఇన్నాళ్లకు అది నెరవేరడంతో సంతోషంగా ఉన్నదని చెప్పారు. గిరిజన సంక్షేమశాఖ, ఎఫ్‌డీసి సహకారంతో ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
రచయిత ప్రాణ్‌రావ్ మాట్లాడుతూ... ఈ చిత్రం కోసం అడవుల్లో కొన్నాళ్లపాటు జీవించి వారి జీవన స్థితిగతులను తెలుసుకున్నానన్నారు. భూపాల్ రెడ్డి కొమరం భీమ్‌గా అద్భుతంగా నటించాడన్నారు. భూపాల్ రెడ్డి మాట్లాడుతూ... పాత్ర పోషణ కోసం భీమ్ సంబంధీకులను కలిసి వారి నుంచి తెలుసుకున్న విషయాలను పాత్రలో జోడించానని చెప్పారు. ఈ చిత్రానికి కెమేరా: భవానీ శంకర్, సంగీతం: గౌతమ్ ఘోష్
