వ్యవస్థలోని అవస్థలపై తిరుగుబాటు చేసే ''అధ్యక్షా...!''
|
నేటి సమాజంలో ఎక్కువైపోయిన భూకబ్జాల ఇతివృత్తంతో ఈ కథ మలచబడింది. సమాజంలో గౌరవప్రదమైన, భాద్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ భాద్యతలను విస్మరిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందన్న విషయాన్ని దర్శకుడు ఈ చిత్రం ద్వారా వివరించే ప్రయత్నం చేసాడు.
కథా విషయానికొస్తే ఓ సాధారణ ఉపాధ్యాయుడైన విజయచందర్‌కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. అందులో పెద్దకుమారుడైన సూర్య కాలేజీ లెక్చరర్‌గాను, రెండో కుమారుడు ప్రైవేటు ఉద్యోగిగాను చేస్తుంటారు. ఉపాధ్యాయునిగా రిటైర్ అయిన తర్వాత విజయచందర్ తనకున్న స్ధలంలో ఓ ఇంటిని నిర్మిస్తాడు. తీరా ఆ యింటిలో గృహప్రవేశం చేసే సమయానికి అక్కడికి వచ్చిన గూండాలు ఆ ఇంటిని కబ్జా చేస్తారు.
దాంతో విజయచందర్ పోలీసులు, కోర్టులు, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతాడు. కానీ అక్కడ అతనికి న్యాయం జరక్కపోగా అతను జైలుపాలవుతాడు. అయితే ఎలాగో బెయిల్ మీద తిరిగొచ్చిన విజయచందర్‌కు గూండాల నుంచి మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి.
ఈ నేపథ్యంలో విజయచందర్ కొడుకు గూండాల అన్యాయాన్ని ఎదిరించి వారి కత్తిపోట్లకు గురవుతాడు. అలాగే విజయచందర్ కూతుర్ని గూండాలు మానభంగం చేస్తారు. ఆ అమ్మాయి ప్రేమించిన వ్యక్తిని సైతం హత్య చేస్తారు. జరిగిన ఘోరాల్ని చూడలేక విజయచందర్ గూండాలతో రాజీకొస్తాడు. అప్పుడు గూండాలిచ్చిన 15లక్షలు తీసుకుని విజయచందర్ తన ఇంటిని ఖాళీ చేస్తాడు.
ఆ తర్వాత విజయచందర్ ఆ డబ్బుతో ఏం చేశాడు. మరి ఈ చిత్రంలో బ్రహ్మాజీ, రఘుబాబు, జీవాల పాత్ర ఏమిటి అన్న విషయం తెలుసుకోవాలంటే చిత్రం చూడాల్సిందే. రచయితే దర్శకుడైతే చిత్ర కథను ఎలా నడిపించవచ్చో మరుధూరి రాజా ఈ చిత్రంతో నిరూపించే ప్రయత్నం చేశారు.
చిత్రంలోని చాలా సందర్భాల్లో వచ్చే డైలాగులు గొప్పగా ఉన్నాయి. అధికారంలో ఉన్నాం కదాని ఏదిబడితే అది కబ్జా చేయడం కాదురా... సామాన్యుడిలా కష్టపడి ఓ ఆరు గజాలు సంపాదించురా తెలుస్తుంది... లాంటి డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. చిత్రంలో బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఎందుకింత కోపం ఏమి జరిగిందని... అనే జేసుదాస్ పాడినపాట చిత్రానికే హైలెట్‌గా నిలుస్తుంది.
అయితే తనను, తన కుటుంబాన్ని కష్టాలపాలు చేసిన గూండాలు హతమయ్యాక పతాక సన్నివేశంలో విజయచందర్ అసెంబ్లీలో వివరణ ఇచ్చే సన్నివేశంలో ఆవేశం లోపించింది. దీంతో ఆ సీన్లు చప్పగా అనిపిస్తాయి. చిత్రంలోని పాటలు సైతం ఓ మోస్తరుగానే ఉన్నాయి.
మొత్తంగా చెప్పాలంటే క్లాస్ కంటే మాస్‌ను ఆకట్టుకునేలా దర్శకుడు మరుధూరి రాజా చేసిన తొలిప్రయత్నం ఏమేరకు విజయం సాధించిందో తెలియాలంటే మరి కొన్నిరోజులు ఆగాల్సిందే.
