1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. సమీక్ష

వినాయకుడికి ప్రేమించే హక్కులేదా....?

వినాయకుడు సినిమా సమీక్ష రివ్యూ కృష్ణుడు సోనియా శేఖర్
WD
నటీనటులు : కృష్ణుడు, సోనియా, పూనమ్ కౌర్, సూర్య తేజ్, జ్యోతి, ఆదర్శ్, మురళీకృష్ణ తదితరులు
నిర్మాత : సరిత పట్రా, దర్శకత్వం: సాయి కిరణ్ అడవి
విడుదల: నవంబర్ 21న ఓవర్‌సీస్‌లో. 22న ఆంధ్రప్రదేశ్‌లో...

పాయింట్: వినాయకుడులా ఉండే వ్యక్తి నాజూగ్గా ఉండే భామ ప్రేమను కోరుకోవడం తప్పా? ఒప్పా? అనే కాన్సెప్ట్‌తో చిత్రం రూపొందింది.

హ్యాపీడేస్ చిత్రం పుణ్యమా అని అందులో నటీనటులు చాలామంది హీరోలుగా, హీరోయిన్లుగా మారారు. ఆ కోవలోనే సోనియా ఈ చిత్రంలో హీరోయిన్. శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన సాయికిరణ్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా మారారు. సబ్జెక్ట్‌లు ఎక్కడ నుంచో పుట్టవు. మన చుట్టూ ఉన్న సమాజంలోనుంచే వెలువడతాయనేదానికి వినాయకుడు చిత్రం నిదర్శనం.

లావుతోపాటు బొజ్జకూడా కలిగిన ఓ వ్యక్తికి ప్రేమించే హక్కు లేదా... ప్రేమిస్తే తప్పా...మనస్సు నిర్మలంగా ఉండడమే అసలైన అందమని చెప్పే లాజిక్కుతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎక్కువ భాగం రామోజీ ఫిలిం సిటీ, జూబ్లీ హిల్స్ రోడ్లపైన చిత్రించిన ఈ సినిమాను ఆ నలుగురు చిత్ర నిర్మాత సరితా పట్రా నిర్మించారు.

ఇక కథలోకి వెళితే.. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగ నిమిత్తం సొంత ఊరు నుంచి రాజధాని హైదరాబాదుకు వస్తాడు కార్తీక్ (కృష్ణుడు). తన అక్క ఇంటిలోనే మకాం పెడతాడు. ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీలో కల్పన ( సోనియా) తనకు సీనియర్. తను తయారు చేసిన యాడ్స్‌ను అందరూ ప్రశంసిస్తుంటే... కృష్ణుడు మాత్రం లాజిక్కులతో ప్రశ్నిస్తుంటాడు.

అసలే కృష్ణుడు అంటేనే ఎలర్జీ ఉన్న కల్పనకు దీంతో మరింత ముదురుతుంది. మరోవైపు కల్పన తల్లిదండ్రులు మరో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే ఓ కుర్రాడితో పెండ్లి చేయాలనుకుంటారు. వివరాన్నీ కల్పనకు చెప్పడంతో వారిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఓసారి అర్థరాత్రి జంటగా ఉన్న వీరిని పోలీసు పెట్రోలింగ్‌లో ఎస్.ఐ నిలదీస్తాడు.

కల్పనపై వ్యభిచారిణి ముద్రవేసి నిందిస్తాడు. ఈ విషయాన్ని పెద్దది చేయడం ఇష్టం లేని కల్పన స్నేహితుడు ఎస్.ఐకి డబ్బులిచ్చి మేనేజ్ చేస్తాడు. తనను బజారుదాన్నన్న ఎస్.ఐని నిలదీయకపోగా అతనికి లంచం ఇచ్చినందుకు కల్పనకు అతనిపై ఏహ్య భావం కలిగి, విడిపోతుంది.


WD
ఇకపోతే... తొలిచూపులోనే కల్పనపై మనసుపడ్డ కృష్ణుడు ఈ విషయం తన స్నేహితుని ద్వారా తెలుసుకుని ఆనందంలో మునిగి తేలుతాడు. కృష్ణుడు మంచితనాన్ని గ్రహించిన కల్పన తెలీకుండానే అతనికి దగ్గరవుతుంది. కానీ ఆ విషయాన్ని ఎలా చెప్పాలో తెలీక సతమతమవుతుంటే... కృష్ణుడు స్నేహితుడు ఆ బాధ్యతను తీసుకుంటాడు. కానీ విషయం బెడిసికొట్టి అసలుకే మోసం వస్తుంది. మరి ఆ తర్వాత ఏమయింది? కృష్ణుడు ఏం చేశాడు? కల్పన తల్లిదండ్రులు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు...? అనేవి మిగిలిన సినిమా.

ప్రధమార్ధం సరదాగా సాగుతుంది. కథంతా రెండో భాగంలో ఉంది. పాటలున్నా కథనంలో అవి కొట్టుకుపోయినట్లు కనిపిస్తాయి. ముఖ్యంగా సినిమాకు కృష్ణుడు పాత్రే కీలకం. కథంతా తన భుజాలపై మోశాడు. అసలు అతని గురించే సినిమా తీశారు. యువ సీరియల్‌లోనూ, పలు చిత్రాల్లోనూ నటించిన కృష్ణుడు పూర్తిస్థాయి నటుడిగా నటించిన చిత్రమిది.

తన నటనలో, హావభావాల్లో హాస్యాన్ని పండించగలిగాడు. కథకు ప్రత్యేకమైన కామెడీ సన్నివేశాలు, ఆర్టిస్టులు లేని లోటును కృష్ణుడు, అతని స్నేహితులు రక్తికట్టించారని చెప్పవచ్చు. కల్పన పాత్రలో సోనియా సరిపోయింది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై కాల్‌సెంటర్‌తో పలు చిత్రాలు వచ్చాయి. కానీ అక్కడ ఉద్యోగుల ప్రవర్తన, వీకెండ్ పార్టీలు ఎలా ఉంటాయో జుగుప్సాకరంగా లేకుండా దర్శకుడు చక్కగా మలిచాడు.

బాలకృష్ణతో సహా పలు అగ్రహీరోలతో నటించిన అంకిత ఈ చిత్రంలో వ్యాంప్ తరహా పాత్రను పోషించింది. హైటెక్ కల్చర్‌లో ఉండే రకరకాల వ్యక్తిత్వాలు వినాయకుడులో కనిపిస్తాయి. మొత్తంగా వినాయకుడు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT