విశ్లేషణ.. ఈ కథలో పోసాని ఒన్‌మేన్ షో చేశాడు. ఆపరేషన్ దుర్యోధనలో ఇతరుల్ని హీరోగా పెట్టి తీశాడు. కానీ ఈ చిత్రంలో తనే హీరోగా చేశాడు. ఆపరేషన్ దుర్యోధనలో శ్రీకాంత్‌ను అదేతీరుగా నటింపజేశాడు. ప్రజలు అరాచకాన్ని, అన్యాయాన్ని నగ్నంగా చూడాలి. అప్పుడే ఫీలవుతారు. ఆ తర్వాత ఏదో చేయాలనుకుంటారు. ఆ దశలో పోరాడాలనిపిస్తుంది. లేదంటే ఇలాగే జీవశ్చవాల్లా ఉండాల్సి వస్తుందంటూ.. ఆ నగ్న సన్నివేశం గురించి పెద్ద లెక్చరిస్తాడు పోసాని.
ఇదే తరహాలో చేపల చెరువు చిత్రంలోనూ చాలా సంఘటనలు చోటుచేసుకుంటాయి. అధికార పార్టీ అభ్యర్థికి పోటీగా మొగల్తూర్ నుంచి వచ్చిన ప్రజా సేవకుడిగా గిరిబాబును ప్రవేశపెడతారు. రక్తదానం, నేత్రదానం చేసి ప్రజాసేవకుడిగా ముందుకు వస్తానని చెప్పిస్తాడు.
ఇకపోతే.. పోసాని చిత్రంలో కథకంటే సన్నివేశపరంగా డైలాగ్‌లు ప్రస్ఫుటంగా ఉంటాయి. తనపై అధికారి వచ్చి నిందితుడు శ్రీనును స్టేషన్‌నుంచి తీసుకెళితే.. వివిధ కేసుల్లో ఉన్న మిగిలిన వారిని కూడా ఎస్.ఐ హోదాలో వారిని విడుదల చేసి లాజిక్కు వల్లిస్తాడు. ఎమ్మేల్యే మాటకున్న విలువ గెలిపించిన ప్రజలకెందుకివ్వరని ప్రశ్నిస్తాడు.
మరోవైపు కోటశ్రీనివాసరావు చెప్పే డైలాగ్‌లు రాజకీయనాయకుల వితండవాదంలా అనిపిస్తుంది. అసెంబ్లీలో సీఎం అవినీతి పరుడని ప్రతిపక్ష నాయకులు వేలెత్తి చూపితే.. అన్నీ తెలిసిన పోలీసు వ్యవస్థే ఏమీ చేయలేకపోతుంది. అదే సామాన్యుడు చిన్న తప్పు చేస్తే వెంటనే స్పందిస్తారు? ఇదెక్కడి న్యాయమని పోసాని నిలదీస్తాడు.
పార్టీ నాయకుల వ్యక్తిగత విమర్శలను వేలెత్తి చూపించాడు. పోలీసు స్టేషన్ దేవాలయం అనుకున్న రోజునే న్యాయం జరుగుతుందని ఓ సందర్భంలో చెబుతాడు.
అన్నింటికంటే ముఖ్యంగా ప్రభుత్వాధికారుల అవినీతి మయం ఎలా ఉంటుందో చేపల చెరువు పర్మిషన్ కోసం ఎవరెవరిని కలవాలనేది కళ్లకు కట్టినట్లు చూపించాడు.
మొదటి భాగం కాలేజీ అమ్మాయిలపై దాడి చేసే పాయింట్‌తో సాగిన కథ. సెకండాఫ్‌లో చేపల చెరువు పాయింట్‌పై అవినీతి చుట్టూ తిరుగుతూ సాగదీతగా అనిపిస్తుంది, రామాయణంలో హనుమంతుడు సంజీవని కోసం కొండనే ఎత్తి పట్టుకురావడమనేది నిజమైతే తన చేపల చెరువు కన్పించకపోవడం అనేది అంతే నిజమని పోసాని వాదిస్తాడు.
ఇలా తన వాదనలతో, లాజిక్కులతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో లా..జి..క్కు ఎక్కువైంది. మరి చేపల చెరువును ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే..!