Ningi Nela Nade| Review| Leaching Yavo| Chava Sudharani| Invisible wings | సంకల్పాన్ని నింపే ''నింగి..నేల..నాదే..''
|
నటీనటులు: లీచింగ్ యావో, మీచింగ్ మావో, ఫెంగ్ జుయాంగ్ తదితరులు,
దర్శకత్వం: ఫెంగ్ జెంజి,
మాటలు, పాటలు: వెన్నెలకంటి,
తెలుగు అనువాద నిర్మాత: చావా సుధారాణి,
బేనర్: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్,
ఇంగ్లీషు పేరు: ఇన్‌విజిబుల్ వింగ్స్.
ఇందులో నటీనటులు, సాంకేతిక సిబ్బంది అంతా చైనావారు. చైనాకు చెందిన లీచింగ్ యావో అనే అమ్మాయి జీవితంలో చోటుచేసుకున్న పెను విషాదాన్ని సినిమాగా తీశారు. సినీమాలు జీవితాలపై ప్రభావం చూపుతాయనేందుకు ఈ చిత్రం ఉదాహరణ. గత అంతర్జాతీయ చలనచిత్స్రోవాల్లో ప్రదర్శించబడిన "ఇన్‌విజుబుల్ వింగ్స్"కు తెలుగు అనువాదమే "నింగి నేల నాదే". ఈ చిత్రం చూస్తుంటే జీవితం కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది.
రొటీన్ సినిమాల్లోని డ్యూయెట్లు, యువతను పక్కదోవపట్టించే ధోరణిలు ఇందులో కనబడవు. రెండుచేతులు కోల్పోయిన యావో తేరుకుని అనుకున్నది సాధించిన విధానమే ఈ చిత్రకథ.
ఇక కథలోకి వెళితే..... గాలిపటాలు తయారుచేసే కుటుంబం లీచింగ్ యావోది. తన తల్లిదండ్రులతో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతున్న యావోది మధ్యతరగతి కుటుంబం. చదువుల పుట్ట అయిన యావో ఆటపాటల్లోనూ దిట్ట. డాక్టర్ కావాలనేదే ఆమె సంకల్పం. ఒకసారి ఇంటికి దగ్గరలోనే గాలిపటాన్ని ఎగరేస్తుండగా ఆ పటం కరెంట్ ట్రాన్స్‌ఫారమ్‌కు చిక్కుకుంటుంది.
దాన్ని తీసే క్రమంలో యావో పెనుప్రమాదానికి చిక్కుకుని రెండుచేతులు కోల్పోతుంది. ఆ షాక్‌తో ఆమె తల్లి మతి కోల్పోతుంది. అయితే యావో తండ్రి మొక్కవోని ధైర్యంతో ఆమెను పెంచుతాడు. ఏది సాధించాలన్నా చేతులులేందే సాధ్యంకాదు. తోటి స్నేహితురాలుకూడా ఆమెను ఓ సందర్భంలో అసహ్యించుకుంటుంది.
ఇటువంటి పరిస్థితులమధ్య తండ్రి ప్రోత్సాహంతో జీవితంలో ముందుకు సాగాలనుకుంటుంది యావో. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైనా వికలాంగురాలైనందువల్ల మెడిసిన్‌కు చదివేందుకు అనర్హురాలిగా యూనివర్శిటీ ప్రకటిస్తుంది. ఈ పరిస్థితుల్లో అనుకోని స్థితిలో తల్లికూడా మృతిచెందడంతో యావో మరింత కుంగిపోతుంది.
జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి చోటుచేసుకున్న పరిణామాలతో యావో కలత చెందుతుంది. తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ఈత నేర్చుకుంటుంది. ఆ సమయంలో వచ్చిన ఒకే ఒక్క అవకాశం జాతీయస్థాయిలో ఈత పోటీల్లో పాల్గొనడం. ఈమెలాగే రెండుచేతులులేనివారు, ఒక కాలు లేనివారు, ఇలా అంగవైకల్యం ఉన్నవారంతా పోటీల్లో పాల్గొంటారు.
ఎన్ని బాధలున్నా కోచ్ సహకారంతో ముందుకుసాగి పోటీలో ప్రథమశ్రేణిలో నిలుస్తుంది. దాంతో ఆమె సాధించిన విజయానికి కానుకగా యూనివర్శిటీ మెడిసిన్ చదివేందుకు ఆహ్వానం పలుకుతుంది. ఇదీ కథ.
విశ్లేషణ: ఇందులో పాత్రలన్నీ సమాజంలో కనబడేపాత్రలే. దేశాలు వేరైనా మనిషి ఆలోచనా విధానాలు, ప్రవర్తనలు ఒక్కటే అని "నింగి నేల నాదే" సినిమా నిరూపిస్తుంది.
సందర్భానుసారంగా వెన్నెలకంటి రాసిన మాటలు తూటాల్లా పేలాయి. 'దురదృష్టం ముందు దురదృష్టం ఎంతా.. సంకల్పం ముందు వైకల్యం ఎంత.. ఎదురీతముందు. విధిరాత ఎంత...' అనే పాట చిత్రానికి హైలైట్. వినడానికి బాగున్నా.. నిజజీవితంలో ఆమె సాధించిన తీరు అద్భుతంగా ఉంది.
2002 ఒలింపిక్స్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అప్పటి చైనా ప్రభుత్వం ఈ చిత్రాన్ని స్కూల్స్‌లోనూ ప్రదర్శించేలా చర్యలు తీసుకుంది. అప్పట్లో యువత నిరాశ నిస్పృహలో ఉందని గ్రహించిన చైనా అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కథ చిత్రంగా మారడంకూడా విచిత్రంగానే జరిగింది.
లీచింగ్ యావో నిజజీవితంలో జరిగిన సంఘటన చైనా వార్తపత్రికలో ప్రచురితమైంది. దాన్ని సినిమా మలచాలని బెంజ్ నిర్ణయించారు. చైనాలో ప్రేక్షకుల ప్రశంసలు పొందిన చిత్రాన్ని అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఐమాక్స్‌లో 2005లో ప్రదర్శించారు. అక్కడ ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకుంది. కానీ ఇటువంటి చిత్రాలు ఆ తర్వాత ప్రజాదరణ పొందవు. ఈ చిత్రాన్ని చూసిన చావా సుధారాణి చైనా వెళ్ళి వాటి అనువాద హక్కుల్ని పొందింది.
మొదట ఆమెకు వ్యతిరేకత వ్యక్తమైంది. వ్యాపారమయిన సినిమా ఇండిస్ట్రీలో ఇటువంటి చిత్రాలు ఆదరణ చూరగొనవని చాలామంది చెప్పారు. చైనా భాష నుంచి ఇంగ్లీషుకు అక్కడినుంచి తెలుగుకు అనువాదం చేయడం సాహసంతో కూడుకున్నదే. ఈ చిత్రాన్ని చూసి ఓ ఒక్కరైనా మార్పుచెందితే చాలని నిర్మాత చావా సుధారాణి ఆశించారు. ఆమె అనుకున్నట్లే ఈ చిత్రం విడుదలైనచోట్ల ఆదరణ చూరగొంటుంది.
'వెలుగు నీడలు'లో శ్రీశ్రీ రాసిన 'కలకానిది విలువైనది బతుకు కన్నీటి...' అంటూ రాసిన గీతం ఆనాడు ఓ వ్యక్తి మరణాన్ని ఆపింది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆ వ్యక్తి కేవలం రేడియోలో ఈ పాటను విని ధైర్యం తెచ్చుకున్నాడని ఆనాడు పేపర్లు ప్రచురించాయి.
సరిగ్గా నింగీనేల నాదే.. చిత్రానికి కూడా అదే జరిగింది. మహబూబ్‌నగర్‌కు చెందిన ఫెయిలయిన ఇంటర్ విద్యార్థి ఈ చిత్రం గురించి రేడియో ఎఫ్‌ఎం.లో విని తెలీని ధైర్యంతో విరమించుకున్నాడు. ఈ చిత్రాన్ని చూసి కన్నీళ్ళ పర్వంతం అయ్యాడు. క్షణికావేశంతో యాసిడ్‌దాడులుచేసే యువత, మరేదో చేసి ఎదుటివారిని నొప్పించే యువత తప్పనిసరిగా ఈ చిత్రాన్ని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆర్థికమాంద్యంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇటీవలే కొన్ని సాఫ్ట్‌వేర్‌కుంటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు హైదరాబాద్‌లో జరిగాయి. 90నిముషాల నిడివిగల ఈ చిత్రాన్ని వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి, హౌం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సినిమాటోగ్రఫీమంత్రి గీతారెడ్డితోపాటు విద్యాశాఖామంత్రి మాణిక్యవరప్రసాదరావు తిలకించి చలించపోయారు.
ఓ దశలో తన కళ్ళు చెమర్చాయంటూ.. తన తల్లి పిచ్చిదయిపోయిన సందర్భంలో యావో పలికిన సంభాషణలు, ఆ సన్నివేశం తననెంతో చలించివేశాయని విద్యామంత్రి అన్నారు. ఇలాంటి చిత్రాలు ప్రతి ఒక్కరూ తప్పక చూడాలనీ, ముఖ్యంగా విద్యార్థులు చూస్తే వారిలో దృఢసంకల్పం మరింతగా పెరుగుతుందని సెలవిచ్చారు. తానుకూడా ఓ సందర్భంలో సంకల్పాన్ని కోల్పోయాననీ, ఈ చిత్రం చూశాక తనకు తెలీని ధైర్యం వచ్చిందని విద్యామంత్రి అనడంలో అతిశయోక్తికాదు.
