విషయం: ఎదుటివాడి కన్నీటిని తుడిచేవాడే దేవుడు. అలా మల్లన్న దేవుడు ఎలా అయ్యాడనేది కథ.
విక్రమ్ సినిమాలు ఎలా వుంటాయి? అతని పాత్రలు ఎలా ఉంటాయి? అనే క్రేజ్ ప్రేక్షకుల్లో నెలకొంది. ఆయన నటించే చిత్రాలలో సందేశంతోపాటు కాస్త సీరియస్‌నెన్‌నుకూడా జోడింపుగా ఉంటాయి. అవినీతిని, అన్యాయాన్ని ఎదురించే సూపర్‌మ్యాన్‌లా ఆయన గత చిత్రాలు నిలిచాయి. అపరిచితుడు అటువంటి కోవలోనిదే. కానీ మల్లన్న చిత్రం మాత్రం కాస్త అటూ ఇటూగా... అర్జున్ నటించిన జెంటిల్‌మెన్, మెగాస్టార్ నటించిన 'ఠాగూర్' చిత్రాల కలగలిపి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తీసిన చిత్రంలా కనబడుతుంది.
విక్రమ్ చిత్రాలంటేనే అన్యాయాలను ఎదిరించే పాత్రలని ఇట్టే తెలిసిపోతుంది. అలా ఎదిరించే మల్లన్న సి.బి.ఐ. కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖలో అధికారి. అతని పై ఆఫీసర్ అంటే సిబిఐ జాయింట్ డైరెక్టర్ కృష్ణ. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులను పర్యవేక్షించే బాధ్యతను మల్లన్నకు అప్పగిస్తాడు. మిన్ను విరిగి మీద పడ్డా అతి సాధారణంగా తీసుకునే రకం మల్లన్నది.
శ్రీశైలం ఊరిలో ఈశ్వరుని కొలుస్తుంటారు. ఏ సమస్యలొచ్చినా ఆయనకు విన్నవించుకుంటారు. గుడిలో చెట్టుకు తమ సమస్యలను రాసి కడితే పరిష్కారమవుతాయని వారి నమ్మకం. తన తండ్రి ఆపరేషన్‌కు డబ్బులుకావాలనీ, తమ పిల్ల పెండ్లికి డబ్బులు కావాలనీ, పొలాన్ని కబ్జా చేస్తున్నారనీ ఇలా రకరకాల సమస్యలతో కాగితాలు కడతారు. వాటిని మల్లన్న మారువేషంలో వచ్చి వాటిని పరిష్కరిస్తుంటాడు. అందుకు ఆయన ఎన్నుకున్న మార్గం గబ్బిలం లాంటి డ్రెస్‌తో కోడిపుంజు మాస్క్‌తో వింతగా కన్పిస్తాడు.
పోలీసు అధికారుల్లో అవినీతిని కూడా దేవుడి సెంటిమెంట్‌తో అరికడతాడు. మల్లన్న తనకున్న టీమ్ సభ్యులతో రాష్ట్రంలో ఎక్కడెక్కడ కోటీశ్వరులన్నారో లిస్ట్ తయారుచేస్తారు. ఆ క్రమంలో లెక్కలేనంత సంపాదించిన పల్నాటి పరంజ్యోతి పాపారావు (పిపిపి) అని పిలవడే (ఆశిష్‌విద్యార్థి) ఇంటిపై దాడిచేస్తాడు మల్లన్న. అక్రమంగా సంపాదించిన డబ్బును పట్టుకునే సమయానికి ఢిల్లీ నుంచి హోం మంత్రి ఫోన్ చేయడంతో వెనక్కు తగ్గుతాడు.
అప్పుడే ఇటలీలోవున్న అతని కుమార్తె సుబ్బలక్ష్మి (శ్రియ)తో ఫోన్‌లో మాట్లాడతారు. చిన్న విషయానికి హడావుడి చేసే తత్త్వం ఆమెది. ఆ తర్వాత ఇండియా వచ్చి తన తండ్రి పక్షవాతానికి లోనయినట్లు తెలుసుకుని ఇందుకు కారణమైన మల్లన్నపై పగసాధించుకోవాలని నిర్ణయించుకుంటుంది. తండ్రినుంచి పర్మిషన్ తీసుకుని ప్రేమ పేరుతో మల్లన్న ఆటకట్టించాలని ప్రయత్నిస్తుంది.
సుబ్బలక్ష్మి విషయం టీమ్‌సభ్యులకు నచ్చకపోయినా తనూ ప్రేమిస్తున్నట్లు నటిస్తానని చెబుతారు. ఆ క్రమంలో పేదల కష్టాలు తీర్చే మల్లన్న దేవుడు కాదు.. ఈ మల్లన్నే అని విషయాన్ని గ్రహించి పట్టుకునేట్లు చేస్తుంది. మరోవైపు టాస్క్‌ఫోర్స్ అధికారి ప్రభు మల్లన్న ఎవరు అనే విషయంపై ఆరాతీస్తుంటాడు. ఆ క్రమంలో మల్లన్న దేవుడుకాదు. మనిషే అని గ్రహిస్తాడు. మల్లన్నను పట్టుకోవాలని చూస్తాడు.
ఆ తర్వాత విదేశీ బ్యాంక్‌లో కోట్లాది రూపాయలను ఉన్న పెద్ద చేపను పట్టేందుకు మెక్సికో వెళతాడు మల్లన్న. దీనికి పి.పి.పి. దొంగపాస్‌పోర్టుతో సహకరిస్తాడు. ఆ డీల్ ఓకే అయితే 50-50 అని పి.పి.పి. చెబుతాడు. అందుకు అక్కడ డబ్బు బ్యాంక్‌లో జమచేయాలంటే.. పర్సనల్ కోడ్ కావాలి గనుక మల్లన్నతోపాటు తన కూతురును పంపిస్తాడు. అలా వెళ్ళిన సుబ్బలక్ష్మి ప్రేమలో నిజంగానే పడుతుంది.
మరి అక్కడి నల్లధనాన్ని ఎలా ఇండియాకు తీసుకొచ్చాడు? టాస్క్‌ఫోర్స్ అదికారి మల్లన్నను పట్టుకున్నాడా? ఆ తర్వాత ఏమయింది? అనేది సినిమా.