Avara film review | Karthi | Tamannah | Milind Soman | అమాయకపు పిల్లతో "ఆవారా" జర్నీ
WD
కెమేరా: మాది, సంగీతం: యువన్ శంకర్ రాజా, సమర్పణ: కె.ఇ.జ్ఞానవేల్, దర్శకుడు: లింగుస్వామి
గతంలో రన్, పందెంకోడి వంటి చిత్రాలను రూపొందించిన లింగుస్వామి తెలుగులో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నాడు. తాజాగా తమిళ పయ్యా చిత్రాన్ని తెలుగులో ఆవారాగా అనువదించారు. ఈ చిత్రం ఓ జర్నీ నేపధ్యంలో సాగుతుంది. కథ పాతదే అయినా ట్రీట్‌మెంట్‌లో కొత్తదనం చొప్పించి మాయచేసి ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేయడంలో లింగుస్వామి కృతకృత్యుడయ్యారు.
కథలోకి వెళితే... విద్యనభ్యసించి ఉద్యోగాన్వేషణలో బెంగళూరుకు ఇంటర్య్వూ కోసం వెళతాడు శివ(కార్తీ). కారులో టూర్‌లు తిరగడం అతనికి సరదా. ఒక రకంగా ఆవారాగా తిరుగుతుంటాడు. అటువంటి సమయంలో బస్‌స్టాప్‌లో చారులత(తమన్నా)ను చూసి తొలిచూపులోనే లవ్‌లో పడతాడు. దాంతో ఆమె వివరాలు సేకరించాలని ప్రయత్నిస్తాడు.
అటువంటి సమయంలో ఆమె తన కారులో లిఫ్ట్ అడుగుతుంది. ముంబై వరకూ వెళ్లాలి అంటుంది. ఎదురు చూస్తున్న మనిషి తనవద్దే ఉండటంతో సంతోషిస్తాడు. కానీ అది ఎక్కువసేపు నిలువదు. వీరి కారును కొంతమంది గ్యాంగ్ వెంటాడుతుంది. అందులో శివను అంతం చేయాలనే మరో గ్రూప్ వస్తుంది. వీరందరినీ తప్పించుకుని వారికి దేహశుద్ధి చేసి చారులతను ముంబైకి చేరుస్తాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగింది? అసలు శివను ఎందుకు చంపాలనుకున్నారు..? చారులతను గ్యాంగ్ ఎందుకు వెంబడించింది..? అనేది సినిమా.
ఇందులో ప్రధానంగా జర్నీ అంటే బోర్ కొట్టకుండా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. మధ్యమధ్యలో హాస్య సన్నివేశాలు కూడా ఉన్నాయి. పాటలు ఉన్నాయి. శివ ఫ్రెండ్స్ అలరించారు. హీరో కార్తి పాత్ర డిఫరెంట్‌గా ఉంది. అనవసరమైన ఫైట్స్ లేకుండా పరిమితంగానే కొట్టడం... అది కూడా ఒక గుద్దుకు వందమంది చనిపోవడం లేకుండా రియలిస్టిక్‌గా కణల్ కన్నన్ బాగా చేయించాడు.
చారులత పాత్రలో తమన్నా అలరించింది. అమాయకత్వంతో కూడిన సన్నివేశాల్లో ఆకట్టుకుంది. ముఖ్యంగా వాన పాటలో తన అందాలను ఆరబోసింది. అసలు వానపాట చేయకపోతే నటే కాదని ఇటీవల స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. మొత్తం కారు జర్నీ అయినా మధ్యమధ్యలో పాత్రలు వచ్చి పోతుంటాయి. ఏవీ అసందర్భంగా అనిపించవు. కొన్ని షేడ్స్‌లో తన అన్న సూర్యను తలపిస్తాడు కార్తి. అయినా తన శైలిని కనబరిచాడు. తెలుగులో ఆయనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఇక మిగిలిన పాత్రలు ఫర్వాలేదు.
దర్శకుడు అన్ని రంగాల్లో పట్టు ఉంటే ఎలా చేయగలడో ఈ చిత్రం రుజువు చేసిందని చెప్పాలి. కెమేరా, ఎడిటింగ్, కథాగమనం అన్నీ చక్కగా ఉన్నాయి. యువన్ శంకర్ రాజా బాణీలు ఆకట్టుకున్నాయి. రీరికార్డింగ్ సరిపోయింది. శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు పొందికగా ఉన్నాయి. డబ్బింగ్ చిత్రమనే భావన లేకుండా జాగ్రత్తపడ్డాడు. అందుకే గత నెలలో విడుదల కావాల్సిన సినిమా ఈ నెలలో విడుదలైంది.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చక్కగా తెరకెక్కించారు. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగులో తుఫాను కారణంగా ఆశించిన విజయాన్ని సాధించలేకపోవచ్చని అనిపిస్తుంది. ఆంధ్రాలో కొన్నిచోట్ల ఈ సినిమా వేయలేదు. నైజాంలో ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. స్టార్ ఇమేజ్ లేకుండా చక్కగా చేసిన చిత్రం ఆవారా.
