"సత్యం" చిత్రం దర్శకుడు సూర్యకిరణ్ దర్శకత్వంలో ఆయన భార్య, నటీమణి కళ్యాణి నిర్మిస్తున్నచిత్రం ‘చాప్టర్-6’. బాల, సోనియా సూరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో కళ్యాణి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇటీవలే ఆడియో విడుదలైన ఈ సినిమా గురించి కళ్యాణి మాట్లాడుతూ.. కథ నచ్చడంతో నిర్మాతగా మారాను. కథాంశం పరంగా ప్రేమకథలా కాకుండా పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు.
సినిమా చూస్తున్నంత సేపు ఒక అందమైన నవల చదువుతున్న అనుభూతి కలుగుతుందని తెలిపారు. ప్రేమలోని ఆరు రకాల భావోద్వేగాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’అని కళ్యాణి వెల్లడించారు.
ఆరు రంగుల్లో 'ప్రేమ'ను వర్ణిస్తున్నాం అందుకే ఈ సినిమాకి ‘చాప్టర్-6’ అనే టైటిల్ ఖరారు చేశామని నిర్మాత అన్నారు. ప్రేమ పుట్టుకను నీలి రంగులోనూ, ప్రేమలోని పవిత్రతను తెలుపురంగులోనూ, ప్రేమలోని వైరుధ్యాన్ని నలుపు రంగులోనూ, ప్రేమలోని బాధను లేత పసుపు రంగులోనూ, ప్రేమాన్వేషణను నారింజ రంగులోనూ, ప్రేమ విజయాన్ని ఎరుపు రంగులోన వర్ణిస్తున్నామని కళ్యాణి వివరించారు.
తన భర్త సూర్యకిరణ్ దర్శకత్వంలో కళ్యాణి నిర్మిస్తూ.. నటిస్తోన్న తొలి చిత్రం చాప్టర్-6లోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.