ప్రధాన పేజి   ఇతరాలు > బాలప్రపంచం > కథనాలు
 
'గోడలపై నాట్యం' చేసే చిత్రాలు
Book review
WD PhotoWD
భారతదేశం కళలకు పుట్టినిల్లు. ముఖ్యంగా పల్లెల్లో పురుడు పోసుకున్న పలు రకాల కళారూపాలు అనంతర కాలంలో అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన వైనం మనందరికి తెలిసిందే. అయితే మన దేశానికి చెందిన కళారూపాల పట్ల ఎంత మందికి అవగాహన ఉన్నదనే సందేహానికి స్పష్టమైన సమాధానం దొరకదు.

ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన వర్లి జనాల కుడ్య చిత్రాలను బాలలకు పరిచయం చేసే బృహత్తరమైన బాధ్యతను రచయిత షమీం పదంసేగారు తన భుజస్కంధాలపై వేసుకున్నారు. కుడ్య చిత్రాలను బాలలకు సులువైన రీతిలో తెలియజెప్పేందుకు సందేశంతో కూడిన కథావస్తువును రచయిత ఎంచుకున్నారు. రచయిత ఊహాశక్తికి చిత్రకారులు ఉమా కృష్ణ స్వామి కుంచె నుంచి జాలువారిన వర్ణచిత్రాలు తోడుగా 'గోడలపై నాట్యం' పుస్తకం ఆవిర్భవించింది.

సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని ఒక గ్రామంలో నివసించే చిన్నారి పాప షిర్వి, పండుగ ముందు రోజు ఇంటిని అలంకరించాలని ఉవ్విళ్ళూరుతుంది. ఆ క్రమంలో తల్లిదండ్రులతో సంతకు వెళ్ళడానికి నిరాకరిస్తుంది. తన చిన్ని చేతులతో ఇంటిని ఎలా అలంకరించాలని ఆలోచిస్తున్న షిర్వి, చంద్రుని నుంచి భూమిపైకి దిగి వచ్చిన చిట్టి పొట్టి ప్రాణులు కనిపిస్తాయి.

నీట మునిగిన తమ సహచరుని కాపాడినందుకు కృతజ్ఞతగా చిట్టి పొట్టి ప్రాణులు ఇంటిని అలంకరిస్తాయి. ఎవరో వస్తున్న అలికిడిని గమనించిన ఆ ప్రాణులు గోడలపై బొమ్మలుగా మారిపోతాయి. ఆ బొమ్మలే కాలక్రమంలో వర్లి జనాల కుడ్య చిత్రాలుగా అవతరించాయని రచయిత ఊహామాత్రంగా చెప్పారు.

షిర్వి హావభావాలను అందమైన రంగుల్లో అలంకరించుకున్న వర్ణమాలికగా గోడలపై నాట్యం బాలలను ఆకట్టుకుంటుంది.

రచయిత: షమీం పదంసే; అనువాదం: కె. వెంకటేశ్వర్లు; పేజీలు 28; వెల రూ. 120.
ప్రతులకు తులికా పబ్లిషర్స్, 13 పృధ్వీ ఎవెన్యూ, అభిరామపురం, చెన్నై - 600 018.
మరిన్ని
ఆరోగ్యవంతమైన హృదయం కోసం...
బాలల కరదీపిక 'మాయా పాత్ర'
వాళ్ళను అలా పిలవకండి, లోపం లేనిదెవరికి?
నిశ్శబ్ద విప్లవానికి నిదర్శనం "విద్యాసాగర్"
నక్షత్రం ఎలా పుడుతుందో తెలుసా?
చంద్రుడు మనకి ఎంత దూరంలో ఉన్నాడో తెలుసా?