తమను లాలించి, బుజ్జగించి పెంచే తల్లిదండ్రులంటేనే పిల్లలకు ఎంతో ఇష్టం. అదే గట్టిగా తిట్టి, కోపంగా మందలించి చెప్పే తల్లిదండ్రులంటే పిల్లలకి ఇష్టం స్థానంలో భయం, కోపం పెరుగుతుంది. అయినప్పటికీ.. చిన్నారులకు ఇలా గట్టిగా మందలించి చెప్పటం అన్నది వారికి మంచే చేస్తుందని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది.
ఇలా చిన్నతనంలో మందలింపులకు గురైన చిన్నారులు పెద్దయ్యాక మంచి నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటారని ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం వాషింగ్టన్‌లోని మినెసొటా ప్రాంతంలో కొంతమంది చిన్నారులను, కవల పిల్లలను సుదీర్ఘకాలం పాటు పరిశీలించారు. తరువాత తమ పరిశోధనా ఫలితాలను పరిశోధకులు "ది లీడర్‌షిప్ క్వార్టర్లీ" అనే పత్రికలో ప్రచురించారు.
చిన్నతనంలో మందలించి చెబుతూ.. మద్ధతుగా నిలిచే తల్లిదండ్రులు ఉన్న పిల్లలు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నట్లు తమ పరిశోధనల్లో వెల్లడైనట్లు పరిశోధకులు ఈ మేరకు పేర్కొన్నారు. నిబంధనలను పాటించే పిల్లలు నాయకత్వ లక్షణాల విషయంలో బాగుంటే.. అదే వాటిని ఉల్లంఘించేవారు మాత్రం అంతగా ఎదగలేదని తాము గుర్తించామని పరిశోధకులు వివరించారు.
ఈ పరిశోధనల గురించి రాట్మన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మారియా రోటుండో మాట్లాడుతూ.. బాల్యంలో నిబంధనలను ఉల్లఘించేవాళ్లు పెద్దయ్యాక వినమ్రంగా ఉంటారు తప్ప, పెద్దగా వ్యతిరేక భావాలను ప్రదర్శించలేరన్నారు. అయితే.. పెద్దల మాట వినేవాళ్లందరూ కూడా నాయకులు అయిపోతారని కూడా భావించాల్సిన అవసరం లేదని మారియా వివరించారు.
అదలా ఉంటే.. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు అనేవి పెద్దగా ఎవరికీ అబ్బవనీ.. వారి పెంపకం తీరే వారిని సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వారిగా తీర్చిదిద్దుతుందని పై పరిశోధన స్పష్టం చేసింది. కాబట్టి.. ఎక్కువగా అల్లరి చేసే, మారాం చేసే చిన్నారులను మందలించటం తప్పేమీ కాదు. అది వారిని పెద్దయ్యాక ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది. అలాగని.. క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని అతిగా మందలించటం సరికాదని తల్లిదండ్రులు గుర్తించాలి.