నిద్ర సంబంధిత సమస్యలతో సతమతమయ్యే చిన్నారులు.. అంత చురుకుగా ఉండరన్న సంగతి తెలిసిందే. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందిపడే వారిలో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంతేగాకుండా చిన్నారుల్లో నిద్రలేమి కారణంగా రోగనిరోధక శక్తి లోపించటం, నరాల బలహీనత, మధుమేహం, మైగ్రెయిన్... తదితర వ్యాధి లక్షణాలు కూడా చుట్టుముడతాయని బెర్గెన్ చైల్డ్ స్టడీ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది.
వివరాల్లోకి వెళ్తే... పై అధ్యయనంలో భాగంగా సుమారు నాలుగువేల మంది చిన్నపిల్లలను రెండు విభాగాలుగా చేసి.. పరిశీలించారు. ఆరోగ్యంగా ఉన్న చిన్నారులు, ఇతర అనారోగ్యాలతో బాధపడే చిన్నారులను వేరుచేసి.. వారి ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారు.
ఆరోగ్యవంతమైన పిల్లలతో పోల్చితే, రెండో విభాగానికి చెందిన విద్యార్థులలో నిద్రలేమితోపాటు.. ఇతర వ్యాధి లక్షణాలు కూడా ఉండటాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇలాంటి వారు భవిష్యత్తులో రోగ నిరోధక శక్తి లోపించటం, నరాల బలహీనత, మధుమేహం, మైగ్రెయిన్, సెరిబ్రల్‌పాల్సీ.. తదితర దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నట్లు వారు కనుగొన్నారు.
అలాగే.. చిన్నారుల్లో నిద్రలేమికి గల కారణాలను తెలుసుకునేందుగానూ, పిల్లల దినచర్యకు సంబంధించి వారి తల్లులను కూడా పరిశోధకులు ప్రశ్నించారు. ఇలా చేయటంవల్ల పరిశోధనలో పాల్గొన్న చిన్నారుల్లో కేవలం నాలుగు శాతం మంది మాత్రమే ఆరోగ్యకరమైన దినచర్యలను పాటిస్తున్నట్లు తేలింది.
కాబట్టి.. పిల్లల చదువు, వారి దినచర్య, ఆహారం, నిద్ర నియమాలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పరిశోధకులు, చిన్నపిల్లల నిపుణులు సూచిస్తున్నారు. ప్రారంభంలోనే పిల్లల సమస్యలను పసిగట్టి.. వాటికి అనుగుణంగా దైనందిన కార్యక్రమాల్లో మార్పుల చేయాల్సి ఉంటుందన్నారు. లేకపోతే చిన్నారుల అమూల్యమైన భవిష్యత్తు అంధకారమయమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.