భారతదేశంలో గత మూడు సంవత్సరాల కాలంలో శిశు మరణాల సంఖ్య గణనీయంగా పడిపోయిందని.. రిజిస్ట్రార్ జనరల్ తాజా గణాంకాల్లో భాగంగా వెల్లడించింది. 2007వ సంవత్సరంలో ప్రతి వేయిమంది జననాల్లోనూ 57 మంది శిశువులు మరణించినట్లు నమోదు అయ్యిందనీ.. అదే 2008లో ఈ సంఖ్య 55కు, 2009లో 53కు తగ్గిందని రిజిస్ట్రార్ జనరల్ గణాంకాలు తెలిపాయి.
దేశంలో శిశుమరణాల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందనీ... ఇక్కడ అత్యధిక సంఖ్యలో శిశు మరణాలు నమోదవుతున్నాయని పై గణాంకాలు వివరించాయి. ముఖ్యంగా ప్రతి వేయిమంది శిశువుల్లో 70 మంది పసికందులు కన్నుమూస్తున్నారని తెలిపింది. ఆ తరువాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది.
ఇదిలా ఉంటే... రిజిస్ట్రార్ జనరల్ గణాంకాలను బట్టి చూసినట్లయితే, గత మూడు సంవత్సరాల కాలంలో మొత్తంమీదా దేశంలో శిశుమరణాల సంఖ్య తగ్గినట్లేనని చెప్పవచ్చు. అయితే.. గ్రామీణ ప్రాంతాలలో సగటను వేయి జననాలలో 62 మంది మృతి చెందుతుండగా.. పట్టణ ప్రాంతాలలో ఈ సంఖ్య తక్కువగా అంటే 39గా ఉన్నట్లు తెలుస్తోంది.