Articles | Doctors | Childrens | Finger | Mouth | Teeth Problems | నోట్లో వేలు మానకపోతే ఎత్తుపళ్లే..!
FILE
చిన్నతనం నుంచీ సంవత్సరాల తరబడీ నోట్లో వేలేసుకుని చీకుతుండటంవల్ల పిల్లల చిగుళ్లు దెబ్బతింటాయనీ వైద్యులు చెబుతున్నారు. ఇలా చేయటంవల్ల చక్కగా రావాల్సిన ముందుపళ్లు ముందుకు వంగి ఎత్తుపళ్లగా తయారవుతాయంటున్నారు. పై దవడకి, పళ్లకి, పెదవికి ఒత్తిడి కలగటంతో పై పెదవి సమానంగా ఉండకుండా చిన్నదిగా తయారవుతుందని.. దాంతో ఎంతో అందమైన కళ్లు, ముక్కు ఉన్నా ప్రయోజనం లేకుండా పోతుందని వివరించారు.
కాబట్టి.. ఈ పరిస్థితులనుంచి చిన్నారుల్ని బయటపడాలంటే, చిన్నప్పటినుంచే నోట్లో వేలు వేసుకోనీయకుండా జాగ్రత్తపడాలి. కానీ పిల్లలకి బలవంతంగా ఈ అలవాటును మాన్పిస్తే మానసికంగా దెబ్బతింటారని కొంతమంది చెబుతుంటారుగానీ, అయితే అలాంటిదేమీ లేదని కొన్ని పరిశోధనలు నిరూపించాయి.
నోట్లో వేలు వేసుకునే అలవాటు మానని పిల్లల్లో చదువుపట్ల శ్రద్ధ తక్కువగా ఉంటుందనీ, వారికి వయసుతోపాటు మానసిక వికాసం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకనే చిన్నారుల్ని ఈ అలవాటు నుంచి ఐదు సంవత్సరాల వయస్సులోపే మాన్పించాలని, లేకపోతే వారు ఎత్తుపళ్ల బారిన పడవచ్చునని వైద్యులు సూచించారు.
పిల్లలు మట్టిలో ఆడుకుంటూ ఆ చేతివేళ్లను చీకటంవల్ల మట్టిలోని క్రిములు కడుపులోకి పోవటం, దానివల్ల కడుపునొప్పికి గురవటం లాంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకనే.. తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నతనం నుంచే కనిపెట్టుకుని, ఒకవేళ ఈ అలవాటు ఉన్నట్లయితే మాన్పించే ప్రయత్నం చేయాలి.
ఈ క్రమంలో పిల్లలు నిద్రపోతున్న సమయంలో మెల్లిగా వారి నోట్లోంచి వేలును తీసివేయాలి. కొద్దిగా వయస్సు వచ్చిన పిల్లలు ఆ అలవాటును మానకపోతే వేళ్లన్నింటికీ స్టిక్కింగ్ ప్లాస్టర్ అంటించి చూడాలి లేదా ఏదైనా చేదుపదార్థం రాయాలి.
ఇవన్నీ చేసినా పిల్లలు నోట్లో వేలేసుకోవటం మాననిపక్షంలో పళ్ల వైద్యుల వద్దకు తీసుకెళ్లినట్లయితే, వారు పిల్లల నోట్లో ముళ్లు ఉండే ప్లేటును అమర్చుతారు. అలవాటుగా పిల్లలు నోట్లో వేలు వేసుకున్నట్లయితే ఈ ప్లేటులోని ముళ్లు గుచ్చుకుని. వారు నోట్లో వేలు వేసుకునేందుకు సాహసించరు. అలా క్రమంగా పిల్లలు నోట్లో వేలు వేసుకోవటం మానివేస్తారు.
