Atricles | Chocolets | Tooth Decay | Tooth Doctor for Kids | Sweet Food | Potatoes Chips | చాక్లెట్లు ఎక్కువగా తినే చిన్నారుల్లో "దంతక్షయం"
FILE
చిన్నారులు ఒకేసారి ఎంత మొత్తంలో చాక్లెట్లను తింటున్నారనే విషయంకంటే.. ఎన్నిసార్లు తింటున్నారనే అంశానికి, దంతాల ఆరోగ్యానికి తప్పనిసరిగా సంబంధం ఉంటుందని దంత వైద్యులు పేర్కొంటున్నారు. అదే విధంగా పిల్లలు తీపి పదార్థాలు తింటున్నప్పుడు కూడా ఎంత తింటున్నారనేదానికంటే, ఎన్నిసార్లు తింటున్నారనే విషయంపైనే తప్పనిసరిగా దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు.
భోజనం సమయంలో తీపి పదార్థాలతోపాటు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే బంగాళాదుంపల చిప్స్ తదితర పదార్థాలను తీసుకోవటంవల్ల పిల్లలు, పెద్దల్లో దంత సంబంధిత సమస్యలు, వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పదార్థాలను భుజించినప్పుడు అవి చిగుళ్లలో ఇరుక్కుపోతాయనీ, వాటిద్వారా పళ్ల సందుల్లో బ్యాక్టీరియా వ్యాపిస్తుందనీ, ఈ బ్యాక్టీరియా విడుదల చేసే ఆమ్లాలతో పళ్ళకు రంధ్రాలు పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయంటున్నారు.
అదే విధంగా.. ఒకేసారి ఎక్కువ చాక్లెట్లను తిన్న చిన్నారులు, ఆ తరువాత భోజనం, ఇతర ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు. మధ్య మధ్యలో ద్రవపదార్థాలు కూడా తీసుకుంటుంటారు కాబట్టి వారి పళ్ల సందుల్లోనూ, చిగుళ్లలోనూ బ్యాక్టీరియా ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలా కాకుండా రోజులో ఎక్కువసార్లు చాక్లెట్లు తినే పిల్లల పళ్లపై సూక్ష్మక్రిములు దాడిచేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ముఖ్యంగా నిద్రపోయేందుకు ముందు పిల్లలకు తీపి పదార్థాలను, చాక్లెట్లలను ఎట్టి పరిస్థితుల్లోను ఇవ్వకూడదని దంత వైద్యులు సూచిస్తున్నారు.
