"కోవలం"లో పిల్లలపై పెరుగుతున్న లైంగిక ఆకృత్యాలు: స్టడీ
FILE
అధ్యయనంలో భాగంగా కోవలం మరియు దాని చుట్టుప్రక్కల ఉండే సముద్ర తీర ప్రాంతాలకు చెందిన 705 మంది చిన్నారులను ఇంటర్వ్యూ చేయగా.. వారిలో సగంమందికిపైగా తాము లైంగిక, శారీరక వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా పర్యాటకులు, బంధువులు మరియు ఉపాధ్యాయులవల్ల తాము దాడులకు, వేధింపులకు బలవుతున్నామంటూ పిల్లలు ఈ ఇంటర్వ్యూలో వాపోయారు.
కాగా... మహిళా ఎన్జీవో సంస్థ అయిన మహిళా సమాఖ్య సొసైటీవారు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ సీమా భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు చెందిన నిరక్షరాస్యులైన చిన్నారులు, మత్స్యకారుల పిల్లలు లైంగిక, శారీరక వేధింపులకు గురవుతున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని సీమా చెప్పారు.
అది కూడా 9 సంవత్సరాల వయస్సునుంచే చాలా మంది చిన్నారులు ప్రతిరోజూ శారీరక, లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు తెలియగానే అధ్యయనకర్తలు తీవ్రమైన కలవరపాటుకు లోనయ్యారని ఆమె వాపోయారు. అలాగే ఛారిటీల ద్వారా నడుపబడుతున్న అనాధ అశ్రమాలలోనూ, చైల్డ్ హోమ్స్‌లోనూ ఉంటున్నవారు, తమతో కలసి ఉంటున్న కొంతమంది వేధింపులకు పాల్పడుతున్నారంటూ కూడా పలు ఫిర్యాదులు అందుతున్నట్లు చెప్పారు.

