అమెరికా గడ్డపై జన్మించిన యువతరం వాసుల్లో తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు తెలుసుకునేందుకు వీలుగా తానా చేపట్టిన ఇంటర్నేషనల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్-2007 ముగిసింది. ఈ విషయాన్ని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) కార్యదర్శి, తానా ఐపిపి ఛైర్మన్ ప్రసాద్ తోటకూర విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐపిపి ప్రాజెక్టు కోసం భావన, స్నేహ, సరిత, ప్రత్యుష, ప్రభాత్‌లను ఎంపిక చేయగా, వీరికి ఏడు వారాల పాటు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు.
అందులోభాగంగా సరిత, ప్రభాత్, ప్రత్యుషాలు హైదరాబాద్‌లోని మెడ్విన్ హాస్పిటల్‌లోను, స్నేహ జయభేరి రియల్ ఎస్టేట్‌లోను, భావన వెగెస్నా ఫౌండేషన్ అధ్వర్యంలో నడుస్తున్న మానసిక వికలాంగుల పాఠశాలలో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అంతేకాకుండా డాక్టర్ పట్టాభిరామ్ నిర్వహించిన వ్యక్తిత్వ వికాసం (పర్సనాలిటీ డెవలప్‌మెంట్) తరగతులకు కూడా హాజరైనట్టు తోటకూర పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గత జూన్ 22వ తేదీన కార్యక్రమం ప్రారంభంకాగా, ఏడు వారాల పాటు సాగిందని, ఇందులో పాల్గొన్న విద్యార్థులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తానా ఐపిపి అంబాసిడర్ అవార్డును ప్రదానం చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా.. ఎంపిక చేసిన విద్యార్థులకు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ శాసన సభ్యులు, కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు, టి.సుబ్బరామిరెడ్డి, రాష్ట్ర మంత్రి నేదరుమల్లి రాజ్యలక్ష్మి, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, సినీ ప్రముఖులు డాక్టర్ రామానాయుడు, కాకర్ల సుబ్బారావు, అక్కినేని నాగేశ్వరరావు, మురళీ మోహన్, కృష్ణంరాజుస రాఘవేంద్ర రావు, కీరవాణి తదితరులతో సంభాషించే అరుదైన అవకాశం లభించిందని తోటకూర విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
|