1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. చిట్కాలు

మధురమైన జీవితానికి శృంగారం టానిక్

జీవితానికి శృంగారం టానిక్
జీవితాన్ని మధురం చేసుకోవాలని కలలుగనని ఆలుమగలు ఉంటారని అనుకుంటే అది శుద్ధ అబద్ధమే. ఎందుకంటే ఓ మగ, ఆడ జీవితాంతం ఆనందంగా కలిసి జీవించడం కోసమే వారి మధ్య మూడు ముళ్ల బంధమేసి ఒకటి చేసేది.

మరి అలా ఒకటైన జంటలన్నీ సుఖంగా, సంతోషంగా జీవితాంతం కలిసి ఉండకుండా కొందరు మధ్యలోనే తమ బంధాన్ని తెంచేసుకుంటున్నారు. ఇలా వీరు విడిపోవడానికి కారణాలు ఎన్నైనా వారి మధ్య అన్యోన్యత లోపించడమే ప్రధాన కారణమని విడిపోయినవారిని చూస్తే అర్ధమవుతోంది.

అన్యోన్యత లేకపోవడమంటే అది కేవలం బాహ్యంగా అందరికి కనిపించే కారణాలు కొన్నైతే ప్రధానంగా వారి దాంపత్య జీవితంలో లోపించిన సఖ్యతే కూడా ఓ కారణమవుతోంది. మిగిలిన విషయాల్లో భేదాభిప్రాయాలున్నా సంసార జీవితంలో సఖ్యత కుదిరితే ఆ జంట దాదాపు విడిపోవడమన్నది జరగదనే చెప్పవచ్చు.

అందుకే మన పెద్దవాళ్లు చెబుతుంటారు, ఆలూమగల గొడవలు పడకింటిలో తీరిపోతాయని. కానీ ప్రస్తుతం చాలా జంటల గొడవలు ఇక్కడనుంచే ప్రారంభం కావడం అందరికి తెలిసిందే. ఇందుకు కారణం వారి మధ్య ముద్దు, ముచ్చట్లు లోపించడమే కారణం. ముద్దు, ముచ్చట అంటే పొద్దస్తమానం ఒకరికొకరు వాటేసుకుని కూర్చోవడం అనుకుంటే పొరబాటే.

దాంపత్య జీవితంలో అవసరమైన మేరకు కాసింత రొమాన్స్ ఉంటేనే వారి మధ్య ప్రేమ సైతం మరింత బలపడుతుంది. రొమాన్స్ అంటే అదేదో సినిమాలో హీరో, హీరోయిన్లు మాత్రమే చేసేదిగా, నిజ జీవితంలో అలాంటివి వీలు కాదన్నట్టుగా చాలామంది ప్రవర్తిస్తుంటారు.


ఒకవేళ పెళ్లయ్యాక భర్త కాసింత రొమాంటిక్ పనులు మొదలు పెడితే ఎప్పుడూ ఏంటీ ఆలోచన అంటూ ఆడవాళ్లు విసుక్కుంటుంటారు. అయితే తమ దాంపత్యం సాఫీగా సాగడానికి శృంగారమే ఔషధమనే విషయాన్ని వారు మర్చిపోతుంటారు.

దాంపత్య బంధంలో సెక్స్ ఎంత ముఖ్యమో, రొమాన్స్ సైతం అంతే ముఖ్యం. ఎందుకంటే సెక్స్ శిఖరానికి శృంగారం మెట్లు లాంటిది. మెట్లు లేని శిఖరాన్ని చేరుకోవడం ఎంత కష్టమో, శృంగారం లేని సెక్స్ సైతం అంతే కష్టం. అందుకే దంపతులు అనుసరించాలే గాని జీవితంలో ప్రతి సన్నివేశంలో రొమాన్స్‌ను ఆస్వాదించవచ్చు.

ఉదయం నిద్ర లేచిందే ఓ భార్య తన భర్త నుదుటి మీద ఓ ముద్దిచ్చిందంటే ఆతని ఆ భావన ఆ రోజు పూర్తయ్యే వరకు నిలిచిపోతుంది. అలాగే భార్య చేతికిచ్చిన కాఫీని ఓ చుక్క తాగి ఆహా ఎంత బాగుంది అని చూడండి. అంతేనా ఆ సమయంలో ఓ రొమాంటిక్ లుక్‌తో మీ భార్యను చూడండి.

ఇక ఆమె మొహంపై ఎన్ని సిగ్గుల మొగ్గలు చిరు నవ్వుల పువ్వులై విచ్చుకుంటాయో. అలాగే భార్యా, భర్తల మధ్య పరస్పరం చిన్ని ప్రశంసలు, అప్పుడప్పుడు కలిసి అలా షికారు కెళ్లడం, నెలకోసారి సరదాగా సినిమాకు వెళ్లడం. ఏమీ తోచనపుడు మీ భార్య బదులు మీరే వంటచేసి ఆమె చేత తినిపించేయడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పవచ్చు.

అచ్చంగా ఇలాగే కాకపోయినా మీకున్న పరిధిలో మీకు నచ్చిన విధంగా ఉండి చూడండి. మీకు పెళ్లై ఓ పాతికేళ్లయినా అప్పుడే పెళ్లైన జంటలాగా మీ పడకింటిలో రెచ్చిపోతారు. అవును మరి మీ శృంగారభరితమైన పగటి చేష్టలు రాత్రి మీరు అందుకోబోయే స్వర్గ సుఖాలకు పెట్టుబడి మరి. ఓకేనా ఆల్ ద బెస్ట్.