1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. చిట్కాలు

ప్రేమ మధుర జ్ఞాపకం కావాలంటే... ?

ప్రేమ మధుర జ్ఞాపకం కావాలంటే
WD PhotoWD
ప్రేమ అంటేనే అదో తియ్యని జ్ఞాపకం అంటుంటారు కొందరు. అందుకే ప్రేమను జ్ఞాపకంగా మార్చాలనే తలపుతో చాలామంది ప్రేమ ఒకరితో పెళ్లి ఒకరితో అని కూడా అంటుంటారు. అయితే ప్రేమించినవారితోనే జీవితం కూడా పంచుకోగల్గినపుడే ప్రేమ నిజంగా మధుర జ్ఞాపకం అవుతుంది.

ప్రేమించిన వారితోనే జీవితాన్ని కూడా పంచుకోగల్గితే అలా పంచుకున్న జీవితం కొనసాగే వేళ ఎక్కడో ఏదో క్షణాన తాము ప్రేమించుకున్న రోజుల్లో చవిచూసిన చిరు ఆనందాలు జ్ఞాపకానికి వస్తే... అప్పుడు ఆ గతం తాలూకు మధుర స్మృతులు వర్తమానాన్ని ఎంతటి రంగుల మయం చేస్తాయో అది అనుభవించినవారికే సొంతం.

అందుకే ప్రేమించుకునే సమయంలో కొన్ని మధుర క్షణాలను ప్రేమికులిద్దరూ పంచుకోగల్గితే ముందురోజుల్లో అవే వారికి మధుర జ్ఞాపకాలుగా ఆనందాన్ని పంచుతాయి. తమ ప్రేయసి లేదా ప్రియుడికి ఆనందం కల్గించేలా తియ్యని కబుర్లు చెప్పగల్గడం, వారిలోని ప్రత్యేకతను గుర్తించి దాని గురించి కాస్త గొప్పగా చెప్పడం, ఎదుటివారు ఏదేనీ బాధలో ఉండి మౌనంగా ఉండిపోయిన వేళ వారిని ఓదారుస్తూ నాలుగు మాటలు చెప్పడం, జీవితంలో ధైర్యాన్ని కోల్పోయిన వేళ నీకు నేనున్నానంటూ భరోసా ఇవ్వడం... లాంటివి చేయగలగాలి.

అలాగే సాయంత్రం వేళ ప్రేయసి లేదా ప్రియుడ్ని కలిసే ఛాన్స్ వస్తే అది మీ జీవితంలో ఓ అందమైన క్షణంగా నిలిచిపోయేలా మీరు ప్రవర్తించగలగాలి. అందుకోసం ఏం చేయాలా అన్న అలోచన అవసరం లేదు. చల్లగాలి సాక్షిగా నాలుగు చిలిపి కబుర్లు, సగం సగం పంచుకున్న వేడి వేడీ కాఫీ, చేతిలో చేయి వేసి పక్క పక్కనే సాగించిన విహారం ఇలా ఏవైనా కావచ్చు... అవి మీ ప్రేమను బలీయం చేయడమే కాదు భవిష్యత్‌లో మీ ప్రణయ జీవితానికి గట్టి పునాదులవుతాయి.

ప్రేమంటే ఒకరిని ఒకరు మెప్పించేలా అబద్ధాలు చెప్పడం, ఒకరి దగ్గరున్న సొమ్ము ఖర్చయ్యేవరకు మాత్రమే అనురాగాన్ని కురిపించడం మాత్రం కాదు. ప్రేమంటే ఓ స్త్రీ, పురుషుడు తన మనసుకు నచ్చినవారితో జీవితాన్ని పంచుకునే ముందు కొనసాగించే వేడుకలాంటిది. అలాంటి వేడుకలో విశ్వాసం, ఒకరిపై ఒకరికి నమ్మకం, ఆప్యాయత ఏర్పడగల్గితే జీవనగమనంలోనూ అవి అలాగే కొనసాగి ఓ చక్కని జీవన బంధానికి రహదారిలా మారుతుంది.
About Writer
Munibabu