1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. చిట్కాలు

ఎర్రదనం... పురుషులకు మహా ఇష్టం...

ఇతరాలు ప్రేమాయణం చిట్కాలు ఎర్రగా ఉంటే మగాళ్లు దృష్టి మరల్చరంతే
FileWD
మహిళలపై మగవారికి ఆకర్షణ కలిగేలా చేసే అంశాల్లో ఎరుపు రంగుకు ప్రత్యేకమైన స్థానం ఉందని తాజాగా పరిశోధకులు పేర్కొంటున్నారు. ఎర్రటిరంగు దుస్తులతో అలా నడిచివెళ్లే ఆడవారిని చూసినపుడు మిగతా సమయాల్లో కన్నా మగవారు మరింత ఎక్కువగా వారివైపు ఆకర్షించబడుతారని వీరు చెబుతున్నారు.

అంతే కాదండోయ్ ఎర్రరంగు దుస్తుల్లో ఉన్న ఆడవారు మగవారి కంటికి మరింత అందంగా కూడా కన్పిస్తారట. ఇంతకీ అసలు విషయమేమిటంటే... ఆడవారు ఎలా ఉంటే మగవారిని మరింతగా ఆకర్షించగలరంటూ న్యూయార్క్‌లోని రోచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ ఆండ్రూ ఎలియట్ నేతృత్వంలోని ఓ పరిశోధక బృందం ఓ అధ్యయనాన్ని నిర్వహించింది.

ఇందులో భాగంగా ఈ బృందం వందమంది యువకులను ఎంపికచేసుకుని వివిధ రంగుల దుస్తుల్లో ఉంటే ఓ మహిళ ఫోటోను చూపించారు. ఒకే స్త్రీ అనేక రంగుల దుస్తుల్లో కనిపించినా ఎరుపురంగు దుస్తులతో ఉన్న ఫోటోలోనే సదరు మహిళ మరింత అందంగా కన్పించినట్టు పరిశోధనలో పాల్గొన్న మగవారు తేల్చేశారట.


ఇలా తాము నిర్వహించిన పరిశోధన వివరాల గురించి జర్నల్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ అనే పత్రికలో వివరిస్తూ పరిశోధకులు కొన్ని విషయాలు తెలియజేశారు. మదిలో ప్రేమభావం రగిలించేవిగా భావించే ఎర్రటి గులాబీ, ఎర్రటి ప్రేమ సంకేతం లాంటివాటిలో ప్రధాన పాత్ర పోషించే ఎరుపు రంగు స్త్రీని ఆకర్షవంతంగా కన్పించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.

ఇలా ఎరుపు రంగు దుస్తుల్లో మహిళలు అందంగా ఉన్నట్టు అన్పించడానికి సామాజిక దృక్పథంతో పాటు జీవశాస్త్ర సంబంధ కారణాలు కూడా ఉన్నాయని ఆ పరిశోధనా బృందం తెలియజేసింది. ఈ వార్త చదివాక కూడా ఇంకా ఆలస్యం ఎందుకు... ఓ అందమైన ఎర్ర రంగు డ్రెస్‌లో ప్రత్యక్ష్యం కావడం ద్వారా చాలా రోజులుగా మీ వంక ఓర చూపైనా చూడని బుద్ధావతారం లాంటి మీ ప్రియుడ్ని మీ చుట్టూ తిరిగేలా చేసుకోండి.

అయితే ఓ చిన్న జాగ్రత్త సుమా... పైన చెప్పిన పరిశోధన నిర్వహించింది విదేశీయులు కదా... వారు చెప్పిన ఎరుపు రంగు మంత్రం మనదేశంలో ఏమాత్రం పనిచేస్తుందో తెలియదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండేం. ఎందుకంటే ఎరుపురంగు డ్రెస్ చూచి మీ ప్రియుడు ఆకర్షించబడే మాట అటుంచి కళ్లు తిరిగిపడిపోతే మాత్రం పెద్ద చిక్కొచ్చి పడ్డట్టే.