1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. చిట్కాలు

యవ్వనంలో ఉన్న పందిపిల్లా అందగత్తే

ప్రేమ యవ్వనం ప్రియురాలు ప్రియుడు వ్యక్తిత్వం ప్రేమాయణం
WD
ప్రేమలో పీకల లోతు కూరుకుపోయిన తర్వాత... పెళ్లి చేసుకుని, ఆ తర్వాత... అయ్యో ఇటువంటి వాడినా/దాననా నే పెళ్లి చేసుకుందీ.. అంటూ ఒగరు పోతుంటారు కొందరు. ప్రేమనాడు అప్సరస/మన్మథునిలా కనబడిన ప్రియురాలు/ప్రేమికుడు మూడుముళ్లు పడగానే అనాకారిలా ఎందుకు కనబడుతుంటారూ... అంటే వెనకటి సామెతను ఇక్కడ గుర్తు చేయాల్సిందే.

అదేమంటే... యవ్వనంలో ఉన్నప్పుడు పందిపిల్ల కూడా మహా అందగత్తెగా కనిపిస్తుందట. అంతెందుకు ఎదుటి వాళ్లు... అమ్మా/బాబూ నీ ప్రేయసి/ప్రియుడు పరమ ఛండాలంగా ఉన్నార్రా అంటే, వింటారా. ఊ....హు!! తమదైన వాదనలను వినిపిస్తారు. మరీ గట్టిగా వాదిస్తే, నా కళ్లలోంచి చూడు అతను/ఆమె ఎంత అందంగా ఉన్నారోనని ఊహాలోకాల్లో విహరిస్తారు.

సో... కనుక ఇప్పుడు ఓ ప్రశ్న తలెత్తుతుంది. అదేమంటే, అసలు నచ్చిన వారిని సెలక్ట్ చేసుకోవడం ఎలా...? అనేది. అయితే ఇవి ఒకసారి చూడండి. ప్రేమించే వ్యక్తిలో మీకు సరిపడ గుణగణాలు ఉన్నాయో... లేదా చెక్ చేసుకోవాలి. బయటి ఆకర్షణ ముఖ్యం కాదు... లోపలి గుణగణాలను తరచి తరచి పరీక్షించాలి.

సదరు ప్రేమికుడు/ప్రియురాలు వ్యక్తిత్వాన్ని పూర్తిగా జల్లెడ పట్టాలి. చదువు, కుటుంబ నేపధ్యం ఎలాంటిదో తెలుసుకోవాలి. వివాహానికి ముందు పరిధులు దాటకూడదనే విషయాన్ని ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. ఒకవేళ జారి పడితే... ఆ తర్వాత పరిస్థితులు వాటంతట అవే అత్యంత వేగవంతంగా మారిపోతాయి. ఆలోచించే ఛాన్స్ కూడా ఉండదు.

స్టేటస్‌కు తగినవారినే ఎంచుకోండి. ఎందుకంటే, ప్రేమ అనేది సినిమాల్లో చూపించినంత స్మూత్‌గా ఉండదు. పెద్దల అంగీకారంతో వివాహం జరిగితే ఫర్వాలేదు కానీ స్వతంత్ర వివాహానికి పూనుకున్నప్పుడు ఆర్థిక సమస్యలు కుదేలు చేస్తాయి. అంతే, అప్పటివరకూ స్వర్గంలా తోచిన ప్రేమ నరక కూపంలా కనబడుతుంది.

భార్య/భర్త పాత్రలో ఉన్న ప్రేయసి/ప్రియుడు పెద్ద రాక్షసిలా కనబడతారు. ఈ రాక్షస సంసారాన్ని చూసేకంటే ముందే ప్రేమ స్నేహంలో అన్నీ సరిచూసుకుంటే సంసారం ఓ సుందర ప్రేమాయణంగా సాగుతుంది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT