మీ ప్రేమ బంధం బలంగా ఉందా...? లేదా...?
WD
ప్రేమబంధం, వివాహ బంధం తెగడం, విడిపోవడం దీనికి పరిష్కారం ఎంతమాత్రం కాదు. ప్రేమికులు తమ బంధాన్ని కలకాలం నిలుపుకోవాలంటే, ఇరువురిలో అహాలు రాజ్యమేలి అసలుకే మోసం వచ్చే పరిస్థితుల్లో కూరుకుపోకూడదంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలి. అవేమిటో చూద్దాం.
ప్రేమలో తీయని మాటలు వినటానికి చాలా బాగుంటాయి. అలాంటి మాటలతో ప్రేమను వ్యక్తీకరించండి. మంచిగా మాట్లాడే అవకాశం వస్తే ఆ అవకాశాన్ని జారవిడుచుకోకండి.
సంతోషం పంచుకోడానికి, పార్టీ చేసుకునే అవకాశాలను వెదుకుతూ ఉండండి. బర్త్‌డే, మ్యారేజి డే, జీవితంలోని చిన్న చిన్న విజయాల గురించి ఒక పండుగలా జరుపుకోండి.
మూడవ వ్యక్తిముందు పరస్పరం ఆరోపించుకోకండి. అది మిమ్మల్ని మీరు పలుచన చేసుకోవడానికే దారితీస్తుంది.
ఇతరులను మార్చడానికి ప్రయత్నించకండి. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. వాటిని వ్యతిరేక ధోరణితో అర్థం చేసుకోకండి. వ్యసనాలు వంటి వాటిపై మాట్లాడేటప్పుడు మీ అభిప్రాయాలను సున్నితంగా ప్రకటించండి.
అభిప్రాయాలలో తేడాలు ఉండవచ్చు. వీటికోసం మీరు అప్పుడప్పుడూ పోట్లాడుకోవచ్చు కూడా. కాని అభిప్రాయ భేదం వల్లే పోట్లాడుకోవడం మొదలెడితే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. పోట్లాడకుండా కూడా అభిప్రాయాలను వ్యక్తీకరించుకోవచ్చని తెలుసుకోండి.
వ్యక్తిత్వంలో సానుకూల ధోరణికి, దృక్పథానికి పెద్దపీట వేయండి. మీలోని మంచి మాటలను ఎప్పుడూ గుర్తుంచుకోండి. విచారకర క్షణాలను ఎక్కువకాలం పొడిగించకండి.
అభిప్రాయ భేదాలున్నప్పుడు రాజీమార్గాన్ని అనుసరించడం ఉత్తమం.
