తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి పుష్పాలంకార ప్రియుడన్నది జగద్విదితం. స్వామి ప్రతి నిత్యం వివిధ రకాల పుష్పాలను సమర్పిస్తుంటారు. వేకువ జామున సుప్రభాతసేవ మొదలు, రాత్రి ఏకాంత సేవానంతరం విశ్రాంతి వరకు శ్రీవారికి పుష్పకైంకర్యాన్ని నిర్వహిస్తారు. ప్రతి రోజూ సుమారు 150 కిలోల పుష్పాలను స్వామివారి సమర్పణకు వినియోగిస్తారు. శ్రీవారి ఆలయ సన్నిధిలోని మూలవర్లకు సాలిగ్రామ, శిఖామణి, కంఠహారం, తాయారు తదితర పూలమాలలను అలంకరిస్తారు.
ఉదయం, సాయంత్రం తోమాల సమయంలో స్వామివారికి పుష్పాలంకరణ జరుగుతుంది. వీటితో పాటు అదనంగా ఆలయ రంగనాయకుల మండపంలో నిర్వహించే కళ్యాణోత్సవ సేవకు ఉత్సవరులను కళ్యాణమాలలతో అలంకరిస్తారు. వీటిలో ఒక వంతు పూలు తితిదే వనాల నుంచే సేకరిస్తారు. మూడు వంతులు వివిధ ప్రాంతాల నుంచి విరాళాలుగా వస్తాయి. ఇది నిత్యపుష్ప వైభోగం.
|