స్వాతంత్ర్యం సాధించి 60 ఏళ్లుకావస్తున్నా మహిళలు మాత్రం బానిస సంకెళ్ల నుంచి బయటపడలేదంటున్నారు మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య. ఆమెతో వెబ్‌దునియా తెలుగు ప్రత్యేక ఇంటర్యూ....
ఆరేళ్ళ వయసులో బ్రిటిష్ సైనికులకు ఎదురు తిరిగి దేశ భక్తిని చాటిన ధీరోదాత్తురాలు ఆమె! స్వతంత్ర భారతంలో కులవివక్షపై కన్నెర్ర చేసిన విప్లవ నారి ఆమె!! ఇందిరా గాంధీ వంటి ఉక్కు మహిళ, పిలిచి పదవి ఇచ్చిన పరిణత రాజకీయవేత్త ఆమె!!!
అన్నింటికీ మించి, అన్నార్తులకు, అనాధలకూ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకూ బాసటగా నిలచిన స్వచ్చంద సేవకురాలు ఆమె.
ఇంతటి ఘన చరితకు సజీవ సాక్ష్యం... చిరునవ్వు చెదరని అద్వీతీయ వ్యక్తిత్వం...చెన్నుపాటి విద్య సొంతం. మాజీ ఎంపీగా, సంఘ సేవకురాలిగా, నవయుగ సంఘ సంస్కర్త గోరా కుమార్తెగా మన్ననలు అందుకున్నా విద్యను 60 ఏళ్ల స్వాతంత్ర్యదినోత్సవం సందర్బంగా `వెబ్‌దునియా తెలుగు` ఇంటర్య్వూ చేసింది. ఆ విశేషాలు మీకోసం.
వెబ్‌దునియా: స్వతంత్ర భారతావని స్వేచ్ఛా వాయువుల్ని పీలుస్తూ, నేడు పంద్రాగస్టు సంభరాలు జరుపుకుంటున్న తరుణంలో మీ ప్రతిస్పందన ఏమిటి? విద్య: స్వాతంత్ర్య దినోత్సవం అంటేనే, నా మనసు సంతోషంతో నిండిపోతుంది. ఎందరో మహనుభవుల త్యాగఫలాన్ని మనం ఇపుడు అనుభవిస్తున్నాం. స్వతంత్ర భారతంలో మనం కొంత అభివృద్దిని సాధించగలిగాం. కాని అంతకు మించి అధోగతి పాలవుతున్నామేమో అనే భయం మాలాంటి వాళ్ళకు కలుగుతుంది. ఇప్పటి పిల్లలకు స్వాతంత్ర్యోద్యమ చరిత్ర తెలియదు...ఇప్పటి నేతలకు క్రమశిక్షణ తెలియడంలేదు...ఇప్పటి వ్యవస్థకు ఈ స్వేచ్ఛా వాయువుల విలువ తెలియటం లేదు. ఇకనైనా ఈదుస్థితి నుంచి మనం బయటపడాలి.
|