ఫిబ్రవరి 4, 1944వ సంవత్సరం ఆంగ్లేయుల ఏకాధిపత్య పిడికిలి నుంచి భారత్‌ను రక్షించేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ బయలుదేరిన రోజు. ఆంగ్లేయుల చెర నుండి భారతదేశాన్ని సైనికరీతిన పోరాడి స్వతంత్ర్యం సంపాదించాలనే ఉద్దేశంతో భారతీయులను సైనికులుగా తీర్చిదిద్దిన స్వాంతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్.
స్వాంతంత్ర్య కోసం చేసిన పోరాట చివరిఘట్టంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అప్పటి ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయ శక్తుల సహాయంతో అన్యదేశ మట్టిలో కాలూని భారత్ స్వాతంత్ర్య పోరాటంలో నిమగ్నమైన ఏకైక వీరుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నేతాజీ జరిపిన పోరాటం ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించింది.
అహింస, సాత్త్వికమైన మార్గంలో మాత్రమే స్వాతంత్ర్యం లభించదని ఆయుధాలను చేతపట్టే స్వాతంత్ర్యాన్ని సాధించగలమనే నినాదాన్ని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ లేవనెత్తారు. భారత్ ఆయుధాలతో సైనిక మార్గంలో పోరాడటం తెలుసని ప్రపంచానికి ఎత్తి చూపిన ఘనత నేతాజీకే చెందుతుంది.
అహింసా మార్గంలో మాత్రమే కాకుండా వీర మార్గంలో కూడా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన నేతాజీ తన 23వ ఏటనే భారత జాతీయ కాంగ్రెస్‌లో సభ్యుడిగా చేరారు. బ్రిటిష్ ఏకాధిపత్యాన్ని అహింసా మార్గంలో అణచివేయడానికి 20 సంవత్సరాలు పోరాడారు. తన 41వ ఏటనే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రెండేళ్లు ఎంపికయ్యారు.
అయితే అహింసా మార్గం ఆంగ్లేయులకు అర్థంకాని భాషని తెలుసుకున్న బోస్ 1941వ సంవత్సరం హౌస్ అరెస్ట్‌లో ఉన్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వ కన్నుల్లో మట్టిగొట్టి కలకత్తా నుంచి అదృశ్యమయ్యారు. ఆప్ఘనిస్థాన్, రష్యా, మార్గం ద్వారా జర్మనీ చేరుకున్నారు.
|