బెంగళూరుకు చెందిన కసూర్ బేగం ఒకరికి తెలియకుండా మరొకరిని, ఇలా పదిమంది మగాళ్లను వివాహమాడింది. పెళ్లి చేసుకున్న తర్వాత రెండు మూడు నెలలకు భర్త తనను వేధిస్తున్నాడనే వంకతో ఇంట్లో ఉన్న ఖరీదైన వజ్రాలు, బంగారు ఆభరణాలను తీసుకుని పుట్టింటికి ఉడాయిస్తుంది. ఈ వ్యవహారం రట్టవడంతో పోలీసులకు చిక్కింది. 32 ఏళ్ల బేగంను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. వివరాలలోకి వెళితే... కసూర్ బేగం చాలా తెలివైన, చురుకైన మహిళ. డబ్బును చాలా త్వరగా సంపాదించే మార్గమేమిటని ఆమె- ఆమె తల్లిదండ్రలు శోధించారు. చివరికి ఓ మార్గాన్ని కనుగొన్నారు. అదేమిటంటే, పెద్ద పెద్ద వ్యాపారస్తులను బుట్టలో వేసుకోవడం. ఈ క్రమంలో కసూర్ బేగం బడా వ్యాపారస్తులతో తొలుత ప్రేమాయణం సాగిస్తుంది. ఆ తర్వాత వారిని వివాహమాడి వారివద్ద ఉన్న సొమ్మును దోచుకుని పుట్టింటికి వెళుతుంది. పుట్టింటికి వెళ్లిన బేగంను పిలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రాదు. ఇంటివద్ద నుంచే సదరు భర్తగారికి ఓ లాయర్ నోటీసు అందుతుంది. దాని సారాంశమేమిటంటే, తనను వరకట్నం కోసం భర్త వేధిస్తున్నాడనీ, తన నుంచి విడాకులు కోరుకుంటున్నట్లు ఉంటుంది. ఇలా పదిమంది భర్తలను ఏమార్చింది ఈ కసూర్ బేగం. మోసపోయిన తొమ్మిదిమంది భర్తలు పెద్దపెద్ద వ్యాపారస్తులు కావడంతో కేసుల్లో ఇరుక్కుంటే ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతాయోయని డబ్బు పోయినా ఫర్వాలేదని విడాకులకు సమ్మతిస్తూ ఆమెను వదిలించుకున్నారు. అయితే పదో భర్త అహ్మద్ మాత్రం ఆమెను వదలలేదు. కసూర్ బేగం, ఆమె తల్లిదండ్రులు డబ్బుకోసం తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పోలీసు కేసు పెట్టాడు. చివరకి నిజానిజాలను పోలీసులు వెలికి తీసి బేగం గుట్టును బయటపెట్టారు. ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేశారు. |