ఆఫీసులో మీ వ్యవహార శైలి
|
ప్రప్రధమంగా మీరు పాటించవలసింది పుకార్లను షికారు చేయించడంలో మీ పాత్ర లేకుండా చూసుకోవడం. అలా వ్యవహరించడం ద్వారా మీ సహోద్యోగుల దృష్టిలో స్నేహపూర్వక వ్యక్తి అనే పేరును మీరు సంపాదించుకోవచ్చు.
తర్వాత ముఖ్యంగా గుర్తించుకోవలసిన అంశం ఆఫీసుకు సంబంధించిన కీలక అంశాలను బహిర్గతం చేయకుండా
ఉండాలి. మీ బాస్ మీపై అత్యంత నమ్మకంతో ఒక ముఖ్యమైన ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని మీతో ప్రస్తావించినప్పుడు, ఆ అంశాన్ని సహోద్యోగుల వద్ద చర్చించకండి. మీ బాస్‌కు చెందిన గూఢచారులు మీ వ్యవహారాన్ని ఆయనకు చేరవేసే ప్రమాదముంది.
దాంతో మీకు రానున్న మంచి పేరు కూడా వెనక్కి వెళ్లే పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. సహోద్యోగుల వ్యక్తిగత వ్యవహారాలను గురించి మీదైన శైలిలో వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. మీ జీతం పెంపుదలను ఎవరితోనూ చెప్పకండి. ఎవరైనా అడిగితే చిరునవ్వుతో సమాధానం చెప్పండి. ఈర్ష్య, అసూయలు ఎంత పనికైనా పాల్పడతాయి. ఆఫీసులో ఉండగా మీకు సంబంధించిన వ్యక్తిగత ఫోన్ కాల్స్ మరియు ఇంటర్నెట్ వినియోగంపై పర్యవేక్షణ ఉంటుందనే విషయాన్ని మరువవద్దు. ఎల్లప్పుడూ పెదవులపై చెరగని చిరునవ్వు, మర్యాదపూర్వక మాటతీరు, ఆచితూచి స్పందించే సమయస్ఫూర్తి మీ సొంతమైతే మీ ఆఫీసులో మీరే ఉత్తమ ఉద్యోగి అవుతారు.
