1. వార్తలు
  2. »
  3. బిజినెస్
  4. »
  5. కథనాలు

2008లో కనిష్ట స్థాయికి పడిన మార్కెట్

2008లో కనిష్ట స్థాయికి పడిన మార్కెట్
ద్రవ్యోల్బణం 13 శాతానికి పెరగనున్నదనీ, రెపో రేటు, సిఆర్ఆర్‌లను రిజర్వు బ్యాంకు మరో 0.5 శాతం పెంచనుందనే భయాందోళనలతో మార్కెట్ బుధవారం కూడా నష్టాలతో ముగిసింది. ఈ భయాందోళనలకు అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రతికూల ప్రభావం తోడైంది. ఈ కారణాలతో నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు నష్టాలతో ముగియడం ఇది వరుసగా నాలుగో రోజు.

అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడనుందని ఫెడరల్ బ్యాంక్ ఛైర్మన్ బెల్ బెర్నాంకె మంగళవారం ప్రకటించడంతో మార్కెట్ల పతనం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పెట్టుబడిదారులకు, వినియోగదారులకు ఉరటనిస్తూ చమరు ధరలు మంగళవారం కాస్త తగ్గాయి. న్యూయార్క్ మర్చంటైల్ ఎక్ఛ్సేంజ్‌లో మంగళవారం ఆగస్టు కోటా ముడిచమురు ధర 4.44 శాతం తగ్గి 138.74 డాలర్ల వద్ద స్థిరపడింది.

దేశంలో రాజకీయ అనిశ్చితి కారణంగా మార్కెట్‌లపై మరికొద్ది కాలం మరింత భారం పడనుంది. లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం ఈ నెల 22న విశ్వాస పరీక్ష ఎదుర్కోబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రభావం కూడా సెన్సెక్స్‌పై పడింది. ఈ కారణాలతో బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) బుధవారం 2008లో కొత్త కనిష్ట స్థాయికి దిగజారింది.

ఈరోజు లావాదేవీల్లో సెన్సెక్స్ ఒకానొక దశలో 162 పాయింట్లు కోల్పోయి 12,514 పాయింట్లకు చేరుకోవడం ద్వారా ఈ కొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది. నిఫ్టీ కూడా ఈరోజు 3800 పాయింట్ల దిగువకు చేరడం గమనార్హం. క్రితం ముగింపుతో పోలిస్తే 70 పాయింట్లు కోల్పోయిన నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (నిఫ్టీ) 3790 పాయింట్లకు చేరి ఈ ఏడాది కనిష్ట స్థాయిని చవిచూసింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, టాటా స్టీల్, డీఎల్ఎఫ్ వాటాల పతనం రెండు మార్కెట్లు నష్టాలపాలు కావడానికి కారణమయ్యాయి. గురువారం మార్కెట్ స్థిరంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
About Writer
పుత్తా యర్రం రెడ్డి