కేంద్ర ఆర్థిక మంత్రిగా చిదంబరంకన్నా ప్రణబ్ ముఖర్జీ ఎంతో ఉన్నతమైన వారని దేశీయ మధ్యతరగతి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై ఓ ప్రైవేట్ ఛానల్ జరిపిన సర్వేలో తెలిసింది. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశీయ మధ్యతరగతి ప్రజలు, దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేలా ఉందని తాము జరిపిన సర్వేలో బయటపడినట్లు సర్వే నిర్వహించిన బిజినెస్ న్యూస్ ఛానెల్ తెలిపింది. కాని పన్నుల విషయంలో మాత్రం 'ఆమ్ ఆద్మీ'కి తగిన బడ్జెట్ మాత్రం కాదని ప్రజలు అభిప్రాయపడినట్లు ఆ ఛానెల్ పేర్కొంది.ఇదిలావుండగా ప్రస్తుత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ఇదివరకటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం కన్నాకూడా 12శాతం మార్కులు ఎక్కువగా పొందారని, తాము జరిపిన ఈ సర్వేలో 44శాతంమంది ప్రజలు ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా బాగుందని అదే గతంలో చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు, అతని పనితనానికి కేవలం 32శాతంమంది ప్రజలు మొగ్గు చూపినట్లు ఆ ఛానెల్ తెలిపింది.కాగా గతంలో పి. చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో, అతని కార్యకలాపాలకు మాత్రం మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారని ఆ సర్వేలో తేలినట్లు ఛానెల్ తెలిపింది. ప్రస్తుతం భారత్ వేగవంతంగా అభివృద్ధి మార్గాన పయనిస్తోందని, అలాగే ఆర్థిక పరంగా అత్యంత శక్తివంతమైన దేశంగా తయారవుతోందని సర్వేలో ప్రజలు తెలిపినట్లు సమాచారం. దేశంలోని అతి పెద్ద 25 నగరాలలో దాదాపు 2276 మంది మధ్యతరగతి ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 80శాతం ప్రజలు పన్ను రాయితీలు అధికంగా ఉండేలా కోరుకున్నారని తెలిపినట్లు ఆ సర్వే వివరించింది. కాగా ప్రణబ్ మధ్యతరగతి ప్రజల నాడి తెలిసిన వారని సర్వేలో పాల్గొన్న ప్రజలు ఆయన పనితనాన్ని కొనియాడినట్లు బిజినెస్ న్యూస్ ఛానెల్ తెలిపింది. |