ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ ఎగుమతులను 10శాతం పెంచుకుని 54 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు భారతీయ సాఫ్ట్‌వేర్ ఎగుమతి దారులు మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా దేశాలవంటి నూతన మార్కెట్లలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
గత సంవత్సరం ఐటి సాఫ్ట్‌వేర్ ఎగుమతులు 49.5 బిలియన్ డాలర్లు, ఇది 2007-08 సంవత్సరం కన్నా 14శాతం ఎక్కువ. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థికమాంద్యం ఉన్నాకూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఎగుమతులలో వృద్ధి తప్పక ఉంటుందని ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఇఎస్‌సి) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డికె సరీన్ అన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ ఎగుమతుల నుంచి 4.5 బిలియన్ డాలర్లను ఆర్జించాలని కౌన్సిల్ లక్ష్యంగా పెట్టుకుందని, ఇది నిరుడు ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన 3.9బిలియన్ల కన్నా 15 శాతం ఎక్కువని ఆయన అన్నారు.
మన దేశానికి ప్రధాన మార్కెట్లైన అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలలో మాంద్యం ప్రభావం కారణంగా డిమాండ్ పడిపోతోందని దీనిని దృష్టిలో పెట్టుకుని మధ్య ప్రాచ్యం, లాటిన్ అమెరికా, దక్షిణాఫ్రికా, జపాన్ ప్రాంతాలలో మార్కెట్ల కోసం ఇఎస్‌ఇ పరిశ్రమను ప్రోత్సహిస్తోందని ఆయన తెలిపారు.