1. వార్తలు
  2. »
  3. బిజినెస్
  4. »
  5. కథనాలు
  6. YSR

Dr | YSR | Infrastructure | Projects | Irrigation | Krishnapatnam | Gangavaram | మౌళిక వసతులు కల్పించే కంపెనీలకు దెబ్బ...!

రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్
గత బుధవారంనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడంతో రాష్ట్రంలోని ఇతర సంస్థల కన్నా మౌళిక వసతుల కల్పన (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) సంస్థలపై ఎక్కువ ప్రభావం చూపవచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు.

రాజశేఖరరెడ్డి పరిపాలనా కాలంలో మౌళిక వసతుల అభివృద్ధికి పెట్టింది పేరు. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, కృష్ణపట్నం, గంగవరంలాంటి ఆధునిక రేవుల నిర్మాణం చేపట్టడం, ప్రత్యేక ఆర్థిక మండలాల (ఎస్ఇజెడ్‌) వృద్ధి, ఉత్పాదక యూనిట్ల స్థాపన వంటి మౌళిక వసతుల ప్రాజెక్టులను ఆయన పరిపాలనా కాలంలో ప్రభుత్వం చేపట్టింది.

అపాచె, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, కైజెన్ టెక్నాలజీస్, ఎన్‌టిపిసి- భెల్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌లాంటి కంపెనీలు రాష్ట్రంలో తమ యూనిట్ల స్థాపనకు వైఎస్ ఎంతో శ్రమించారు. గడచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులపై రూ. 41 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు.

వైఎస్ జలయజ్ఞం కార్యక్రమాన్ని కొనసాగించడం ఆయన స్థానంలో ఎవ్వరు ముఖ్యమంత్రిగా వచ్చినా వారికి బృహత్ కార్యక్రమమే కాగలదు. ఈ పథకం కింద రూ. 1లక్షా 76 వేల కోట్ల ఖర్చుతో దాదాపు 84 నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించాల్సి ఉంది.

గతంలో సత్యం మాజీ అధినేత బైర్రాజు రామలింగరాజు ఏర్పాటు చేసిన మెటాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఇటీవలే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ స్వాధీనం చేసుకుంది. అలాగే నిర్మాణ రంగానికి చెందిన నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ, ఇందూ ప్రాజెక్ట్స్, నవయుగ ఇంజనీరింగ్, గాయత్రి ప్రాజెక్ట్స్‌తో సహా రాష్ట్రంలో ప్రధాన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలన్నీ రాజశేఖరరెడ్డి కార్యక్రమాల వల్ల లబ్ధి పొందినవే.

ఆయన స్థానంలో వచ్చే ముఖ్యమంత్రి అదే ఊపుతో ఆ పథకాలను కొనసాగించకపోతే ఆయా కంపెనీలు నష్టానికి గురి కాక తప్పదంటున్నారు ఆర్థిక నిపుణులు. చివరికి అరబిందో, హెటిరో డ్రగ్స్‌లాంటి ఔషధ సంస్థలు కూడా రాష్ట్రానికి వచ్చాయంటే వైఎస్ చలవేనంటున్నారు విశ్లేషకులు.

వీటిని కేంద్రం ప్రభుత్వంనుంచి మంజూరు చేయించడానికి ఆయన తనవంతు కృషి చేసి రాష్ట్రానికి ఎంతో మేలు చేశారు. వీటిని నిలుపుకోవడానికి రానున్న ముఖ్యమంత్రి కృషి చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రజల ఉపాధికూడా ఆధారపడి ఉందంటున్నారు విశ్లేషకులు.
About Writer
Gulzar Ghouse