ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » కథనాలు » ఇంటిని గుల్ల చేసే అదుపులేని ఖర్చు... ఏమిటి మార్గం? (Expenses | Money | Spend | Family Budget Plan | TV | AC | Fans)
ఇంటిని గుల్ల చేసే అదుపులేని ఖర్చు... ఏమిటి మార్గం?
WD
కొంతమంది అపుడపుడు చెపుతుంటారు.... వేయి రూపాయల సంపాదన ఉన్నప్పుడే హాయిగా ఉన్నామని. ఇపుడేమో వేలకు వేలు చేతుల్లోకి వచ్చినా... ఎప్పుడు చూసినా అప్పు చేయాల్సి వస్తోందని వాపోతుంటారు. అసలు అంత ఖర్చు ఎందుకు అవుతున్నట్లు..? అనే అంశంపై దృష్టి సారించి దానిని అదుపులో పెట్టగలిగితే, ఇపుడు కూడా ఆనందంగానే ఉండవచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు.
ఆగని ఈ ఖర్చుల ప్రవాహానికి క్రింది విధంగా అడ్డుకట్ట వేయవచ్చంటున్నారు...
భారీ ఖర్చుతో ముడిపడి ఉండే మీ దీర్ఘకాలిక ప్రణాళికలను ముందే తయారు చేసుకోండి. అదేవిధంగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నప్పుడు, చేతిలో చిల్లిగవ్వ లేని సమయంలో ఆ ప్రయత్నం చేయకండి. ఒకవేళ అటువంటి ప్రయత్నం తప్పనిసరి అని అనుకున్నప్పుడు ఆర్థిక నిపుణుల సలహాను తీసుకోండి.
చేతిలో నగదు ఎక్కువగా ఉన్నప్పుడు... దాన్నలానే ఉంచారంటే.. తప్పకుండా ఖర్చయిపోతోంది. ఖర్చయిన తర్వాత... కుటుంబంలోని వ్యక్తులపై అంత డబ్బు ఏమైందని అరిస్తే ప్రయోజనం శూన్యం. కనుక ఖర్చులను లెక్కవేసి మిగిలిన మొత్తాన్ని రికరింగ్ డిపాజిట్లలో వేసేయండి.
మీ ఇంటికి నెలవారీ ఖర్చు ఎంత అవుతుందో లెక్క చూసుకోండి. ఆ చిట్టాను చూస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఎందుకంటే వాటిలో అనవసర ఖర్చులు చాలా ఉంటాయి. కనుక అటువంటివాటిని కనుగొని డబ్బు మిగల్చాలంటే నెలసరి బడ్జెట్ తప్పనిసరి.
ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే... ఖర్చు పెట్టేందుకు అప్పు చేయకూడదన్న విషయం. నేడు ప్రతి ఒక్కరికి క్రెడిట్ కార్డ్ సౌకర్యం అందుబాటులో ఉండటంతో డబ్బును ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసేస్తున్నారు. కనుక క్రెడిట్ కార్డుకు స్వస్తి చెప్పి డెబిట్ కార్డ్‌ను ఉపయోగించండి. డబ్బు మిగులుతుంది.
నెలకు సరిపడా వంటింటి సరుకులు మాత్రమే కొనండి. డబ్బులున్నాయి కదా అని... రెండు మూడు నెలల స్టాకును ఇంటికి తెచ్చుకోకండి. దానివల్ల చేతిలో ఉన్న డబ్బు ఖాళీ అవడమే కాక... తెచ్చిన వస్తువులు వృధా పోయే అవకాశం లేకపోలేదు.
షాపింగ్ చేయడంపై మక్కువ చూపుతుంటారా...? అయితే ఏం కొనాలనుకుంటున్నారో ముందే ఒక చీటిలో రాసుకోండి. దుకాణానికి వెళ్లిన తర్వాత మీకు అవసరమైనది కాక చూసిన ప్రతి వస్తువును కొనాలనే కోరిక కలుగుతుంది. ఆ కోరికకు అడ్డుకట్ట వేసి మీకు కావలసిన సరుకులు మాత్రమే కొనుగోలు చేయండి. డబ్బు మిగులుతుంది.
ఏదో ఇంట్లో ఉంటుందిలే అనుకుని అవసరం లేని వస్తువులకు డబ్బును ఖర్చు చేయకండి. ఆ వస్తువు ఎలాగూ మీకు ఉపయోగపడదు. కాగా చేతిలో ఉన్న డబ్బు ఖర్చయిపోతుంది.
పిల్లలకు రెండు మూడు బొమ్మలు కొనవచ్చు కానీ, షాపులో ఉన్న వెరైటీ బొమ్మలన్నిటినీ కొనుగోలు చేయకండి. దీనివల్ల మీ చేతిలో ఉన్న ధనం ఖర్చయిపోవడమే కాక మీ ప్రేమ మీ చిన్నారికి దూరమవుతుంది. మీ పాపకు మీరు కావాలి.. అంతేగానీ బొమ్మ కాదు.
మీరు వేసుకున్న బడ్జెట్ మించి ఖర్చు చేయాల్సి వస్తుంటే... లెక్క చూసుకోండి. ఎక్కడ ఎక్కువ ఖర్చుపెట్టామోనని తరచి తరచి చూడండి. ఖచ్చితంగా అప్పటికి అవసరం లేని ఏ వస్తువునో మీరు కొనుగోలు చేసి ఉంటారు. మరో ఆలోచన లేకుండా దాన్ని మీ లిస్టు నుంచి తొలగించండి. డబ్బు మిగులుతుంది.
ఇక ఇంట్లో ఉన్నా.. బయట ఉన్నా మనం నిత్యం చేసే పొరపాటు ఒకటి ఉంది. అదే ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు, టీవీలు పెట్టడం. అవసరం లేకపోయినా ఇంట్లో లైట్లను వేస్తుంటాం. అలాగే ఫ్యాను 24 గంటలూ తిరుగుతూనే ఉంటుంది. ఇక టీవీ విషయానికి వస్తే... కుటుంబ సభ్యులందరూ కూర్చుని ఏదో ఓ విషయం గురించి చర్చించుకుంటుంటాం. ఆ సమయంలో టీవీ మాత్రం దానంతట అది కార్యక్రమాలను అందిస్తూనే ఉంటుంది. ఇటువంటి వాటిని అడ్డుకోవాలి. దీనివల్ల చేతిలో ఉన్న పైసా వృధా పోదు.
పైన చెప్పిన అంశాలను పాటించి చూడండి. ఖచ్చితంగా మీ చేతిలో డబ్బు ఉంటుంది. ధనవంతులవుతారు.