1. వార్తలు
  2. »
  3. బిజినెస్
  4. »
  5. కథనాలు
  6. 3జీ వేలం ద్వారా ఖజానా లోటును పూడ్చుకోవచ్చు

Govt, 3G, Spectrum, Telecom sector, GDP | 3జీ వేలం ద్వారా ఖజానా లోటును పూడ్చుకోవచ్చు

కేంద్ర ప్రభుత్వం
ప్రస్తుతం దేశంలో కేంద్ర ప్రభుత్వం మూడవ తరం(3జీ)స్పెక్ట్రమ్‌ను వేలం వేస్తోంది. దీనికి దేశీయ టెలికాం దిగ్గజాలు గట్టిపోటీనిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వానికి దాదాపు రూ. 50,000 నుంచి రూ. 55,000 కోట్ల ఆదాయం రానుంది. దీంతో ప్రభుత్వ ఖజానా లోటును పూడ్చుకోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

టెలికాం రంగంలో నెలకొన్న పోటీ కారణంగా 3జీ స్పెక్ట్రమ్ వేలం ద్వారా రూ. 35,000 కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర ప్రభుత్వం గతంలో భావించింది. కాని ప్రస్తుతం తాజాగా నెలకొన్న పరిణామాల ద్వారా ఈ లాభాలు మరింత పెరిగి రూ. 50,000 కోట్ల నుంచి రూ. 55,000 కోట్ల మేరకు ఆదాయం రానుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఖజానా లోటు జీడీపీ 5.5 శాతం లేదా రూ. 3.81 లక్షల కోట్ల రూపాయల లోటును పూర్తి చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా కేంద్ర ప్రభుత్వం 3జీ స్పెక్ట్రమ్ వేలాన్ని ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం గతంలోనే భారత సంచార నిగమ్ లిమిటెడ్, మహానగర టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ సంస్థలకు లైసెన్స్ మంజూరు చేయడం జరిగింది. వేలంపాట ద్వారా ప్రైవేట్ టెలికాం సంస్థలు ఎంత మొత్తం చెల్లిస్తాయో అంతే మొత్తం ఈ సంస్థలు కూడా చెల్లించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయం మరింతగా పెరగనుందని టెలికాం రంగానికి చెందిన విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ఈ వేలం పాటలో భారతి ఎయిర్‌‍టెల్, రిలయన్స్ కమ్యునికేషన్, వోడాఫోన్ ఎస్సార్, ఐడియా సెల్యూలార్, టాటా టెలీ సర్వీసెస్, ఎయిర్‌సెల్, ఎస్‌‍టెల్, వీడియోకాన్ టెలికమ్యునికేషన్‌తోపాటు మరో తొమ్మిది సంస్థలు పోటీ పడుతున్నాయి.