ఏడు సంవత్సరాల కాలంలో సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ నిమిత్తం బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.500 కోట్ల కాంట్రాక్టును కైవసం చేసుకున్నట్లు ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్ ప్రకటించింది. కాంట్రాక్టులో భాగంగా రానున్న 18 మాసాలలో బీఎస్ఎన్ఎల్‌కు అవసరమైన కన్వర్జంట్ బిల్లింగ్ మరియు కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్‌ను రూపొందిస్తామని హెచ్‌సీఎల్ సీఈఓ అజయ్ చౌదరి తెలిపారు.
అదేవిధంగా ప్రాజెక్టులో భాగంగా కోల్‌కతా మరియు హైదరాబాద్‌లలో రెండు డేటా సెంటర్లు నెలకొల్పుతున్నట్లు అజయ్ అన్నారు. ప్రతి డేటా సెంటర్ కూడా బీఎస్ఎన్ఎల్ ఖాతాదారులకు విలువ ఆధారిత సేవలను అందించేందుకు సహకరిస్తుందని వెల్లడించారు.
అనంతరం కంపెనీ భవిష్యత్ కార్యక్రమాలలో భాగంగా ఐటీ నిపుణులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే నిమిత్తం రానున్న 15 మాసాలలో దేశవ్యాప్తంగా 100కు పైగా కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు అజయ్ చౌదరి వెల్లడించారు.
|