అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం మాట ఎలా ఉన్నా... స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేసి తద్వారా కఠినమైన ఇలాంటి పరిస్థితుల్లోను తమ ఉనికిని చాటుకోవాలని మొబైల్ ఫోన్ కంపెనీలు, సెల్‌ఫోన్ తయారీదార్లు.. కంప్యూటర్ రంగం నుంచి మొబైల్ రంగంలోకి రానున్న, వచ్చేసిన కంపెనీలు ఉబలాటపడుతున్నాయి.
పీసీల తహాలోనే స్మార్ట్‌ఫోన్‌ల పనితీరు ఉండటంతో.. దీనికి క్రేజ్ బాగా పెరిగింది. దీంతో సత్వరమే మేలుకోకపోతే.. సెల్‌ఫోన్ తయారీ దార్లే పీసీ తరహాలో మరింత అధునాతమైన మొబైల్ ఫోన్ తయారు చేయడం ప్రారంభించేస్తాయనే భయం కంప్యూటర్ తయారీ సంస్థలకు పుట్టుకుందని విశ్లేషకులు అంటున్నారు.
మొబైల్ రంగంలోకి రానున్న కంపెనీలు... మరిన్ని ఆప్షన్‌లు గల స్మార్ట్‌ఫోన్‌తో ఈ ఏడాది మొబైల్ మార్కెట్లోకి అడుగిడబోతోంది ప్రముఖ పీసీ తయారీ సంస్థ ఏసర్ కంపెనీ. ఎనిమిది రకాల సరికొత్త మోడళ్లతో ముందుకు రానున్నట్లు ఇప్పటికే ఏసర్ ప్రకటించింది కూడా. అలాగే మరో ప్రముఖ పీసీ తయారీ దిగ్గజం డెల్ కూడా ప్రోటోటైప్ రకం ఫోన్‌లపై పనిచేస్తోందని వార్తలు వస్తున్నాయి.
నోట్‌బుక్‌ల పేరిట తొలిసారిగా ఆల్ట్రాపోర్టబుల్ ల్యాప్‌టాప్ మార్కెట్లోకి విడుదల చేసిన సంస్థ అసుస్‌టెక్ కూడా త్వరలో స్మార్ట్‌ఫోన్‌లతో మొబైల్ వ్యాపారంలోకి అడుగిడనుంది. రెండు నెలల క్రితం బార్సిలోనాలో జరిగిన వరల్డ్ మొబైల్ కాన్ఫరెన్స్‌లో ఏసర్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గియాన్‌ఫ్రాంకో లాన్సీ మాట్లాడారు.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఎంతో ప్రత్యేకమైనదిగా ఎదుగుతోందని తెలిపారు. అదలా ఉంచితే ప్రపంచంలో చిప్ తయారీ దిగ్గజంగా ఉన్న ఇంటెల్ కంపెనీ కూడా ఇటీవలే సెల్‌ఫోన్ తయారీ సంస్థ అయిన ఎల్‌జీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇవన్నీ ఎలా ఉన్నా... వినియోగదారులకు మాత్రం పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారుల అభిరుచుకులకు అనుగుణంగా అనేక ప్రముఖ కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనున్నాయి. అందునా కంప్యూటర్ తయారీ కంపెనీలు మొబైల్ రంగంలో తమ ఉనికిని చాటుకునేందుకు చేసే ప్రయత్నంలో కంపెనీల మధ్య విపరీతమైన పోటీతో దీని ధర కూడా చాలా వరకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండవచ్చని అంచనా. |