1. వార్తలు
  2. »
  3. తెలుగు వార్తలు
  4. »
  5. కరెంట్ అపైర్స్

''క్విట్ ఇండియా'' ఉద్యమానికి నాంది పలికిన రోజు నేడే

సరిగ్గా 65 ఏళ్ల క్రితం ఇదే రోజు (ఆగస్టు 9వ తేదీ)న తెల్లదొరలు దేశాన్ని వీడి వెళ్లిపోవాల్సిందిగా కోరుతూ... 'క్విట్ ఇండియా'
సరిగ్గా 65 ఏళ్ల క్రితం ఇదే రోజు (ఆగస్టు 9వ తేదీ)న తెల్లదొరలు దేశాన్ని వీడి వెళ్లిపోవాల్సిందిగా కోరుతూ... 'క్విట్ ఇండియా' నినాదంతో నాటి భారత జాతీయ కాంగ్రెస్ ఓ ఉద్యమాన్ని చేపట్టింది. ఆ చారిత్రక దిన ఫలితమే మనం అనుభవిస్తున్న భారత స్వాతంత్ర్య స్వేచ్ఛా ఫలాలు. స్వతంత్ర పోరాటం కోసం జాతిపిత మహాత్మాగాంధీ నేతృత్వంలో అనేక ఉద్యమాలు సాగినా.. క్విట్ ఇండియా ఉద్యమం ఆంగ్లేయుల పాలనలో సంచలనం సృష్టించింది. అహింసామార్గంలో సాగిన ఈ ఉద్యమానికి మహాత్మాగాంధి ఇచ్చిన పిలుపుకు మేల్కొన్న జాతి యావత్తు ముందుకు తరలివచ్చింది.

ఈ ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులపై బ్రిటిష్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆరంభంలో సాత్త్వికంగా కొనసాగిన ఈ ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలతో తీవ్రరూపందాల్చింది. ఆంగ్లేయుల చర్యలను ఏమాత్రం లెక్కచేయక పలు స్వతంత్ర్య సమరయోధులు ఉద్యమాన్ని నిరవధికంగా కొనసాగించడంతో బ్రిటిష్ ఏకాధిపత్యానికి భారత్ తెరదించినట్లైంది. ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రకటించడానికి ఒక నెలకు ముందుగానే 1942 జూలై 14వ తేదీ నుంచి అఖిల భారత కాంగ్రెస్ సమావేశం పూర్తి స్వాతంత్ర్యం లభించాలని తీర్మానం చేసింది.

ఈ తీర్మానం ప్రకారం ఓ కమిటీని మహాత్మాగాంధీ నియమించారు. గాంధీ ప్రకటించిన ఈ కమిటీని రాజాజీ వంటి ప్రముఖ నేతలు అంగీకరించలేదు. మహమ్మద్ అలీ జిన్నా, భారత్ కమ్యూనిస్టు పార్టీ, హిందూ మహాసభలు కూడా ఈ కమిటీ ఏర్పాటుకు సమ్మతించలేదు. 1942 ఆగస్టు ఎనిమిదో తేదీ ముంబైలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టాలని తీర్మానించింది. ఇదే రోజు సాయంత్రం ముంబైలోని కోవాలియా ట్యాంక్ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో మహాత్మాగాంధి, అహింసామార్గంలో ఈ ఉద్యమాన్నిజరపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అయితే ఈ ఉద్యమంలో పాల్గొన్న గాంధి, పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ వంటి పలువురు నాయకులను బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేసి అహమ్మద్ నగర్‌లోని పోర్ట్‌ కారాగారంలో బంధించారు. ఆగస్టు తొమ్మిదో తేదీ ఉదయం ముంబై బహిరంగ సమావేశానికి మూడు లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. అయితే ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించే నేతలు లేకపోవడంతో, యువ వీరవనిత అరుణా ఆసఫ్ అలీ ఈ కాంగ్రెస్ బహిరంగ సభకు నాయకత్వం వహించారు. ముంబైలో అహింసామార్గంలో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమకారులపై బ్రిటిష్ పోలీసులు లాఠీ ఛార్జీలు ప్రయోగించారు.

అయినా దేశంలోని అన్నీ నగరాల్లో ఈ ఉద్యమం ఊపందుకుంది. కార్మికులు ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీరిపై పోలీసులు లాఠీ ఛార్జీలు, కాల్పులు జరిపడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా క్విట్ ఇండియా పోరాటం రోజురోజుకూ తీవ్రమైందే గానీ.. ఏమాత్రం తగ్గలేదు. ప్రారంభంలో నగర ప్రాంతాల్లో మాత్రమే ఆంరభమైన ఈ ఉద్యమం చిన్నగా గ్రామాలకు సైతం వ్యాపించింది. ఈ ఉద్యమంలో భాగంగా స్వతంత్ర సమరయోధులపై పోలీసులు పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. దీనితో ఆగ్రహించిన సమరయోధులు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పంటించారు.

ఈ చర్యలతో విద్యుత్, టెలిఫోన్ సేవలకు పూర్తి అంతరాయం కలిగింది. ఈ ఉద్యమంలో యువకులు, విద్యార్థులు కూడా పాల్గొనడంతో పలు చోట్ల తెల్లదొరలపై దాడులు జరిగాయి. తెల్లదొరల కింద పనిచేసే అధికారులు కూడా ఉద్యమకారుల చేతుల్లో చావుదెబ్బలు తిలక తప్పలేదు. దీనితో బ్రిటిష్ ప్రభుత్వం లాఠీ ఛార్జీ, బాంబు దాడులకు తెరదించింది. ఈ పోరాటంలో పాల్గొన్న ఒక లక్షమందిని బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేశారు. పలు ఉద్యమకారులపై బ్రిటిష్ ప్రభుత్వం కఠినశిక్షలను విధించింది. అయినా ఉద్యమం ఏమాత్రం శాంతించలేదు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజురోజుకి పెరిగిన ఉద్యమం బ్రిటిష్ పాలకుల్లో కొత్త అలజడిని రేకెత్తించింది.

ఈ ఉద్యమాన్ని ఆపేందుకు గాంధీ, నెహ్రూ నాయకులను దక్షిణాఫ్రికాకు తరలించి అక్కడి జైళ్లలో బంధించేందుకు తీర్మానించింది. ఈ వార్తలు ఉద్యమాన్ని మరింత ఉధృతంగా మార్చాయే గానీ.. ఏమాత్రం తగ్గలేదు. మహాత్మాగాంధీ జైళ్లో ఉన్న సమయంలో ఆయన భార్య కస్తూరి గాంధీ మరణించారు. గాంధీ ఆరోగ్యం కూడా క్షీణదశకు చేరుకుంది.

బ్రిటిష్ ప్రభుత్వం నిర్భంధించిన స్వతంత్రసమరయోధులను విడుదల చేయాలని కోరుతూ గాంధీ చేపట్టిన 21 రోజుల నిరాహార దీక్ష విజయవంతమైంది. ఈ విజయమే బ్రిటిష్ ప్రభుత్వానికి చివరికి పరాజయంగా మారింది. 1857 సంవత్సరం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు, 85 సంవత్సరాలకు అనంతరం క్విట్ ఇండియా ఉద్యమాలు బ్రిటిష్ పాలనకు తెరదించాయి. ఐదేళ్ల తదనంతరం అదే ఆగస్టు నెలలో భారత్‌కు పూర్తి స్వాతంత్ర్యం వచ్చింది.