'హరే రామ హరే కృష్ణ.. హరే రామ హరే కృష్ణ...' శ్రీకృష్ణుని భక్తి ప్రపత్తులలో ఓలలాడుతున్న భక్తజనం అంతటా కనిపిస్తారు. భక్తి భావనలో బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయిన తులసిమాల ధారులు గీతాకారుని లీలలను కొనియాడే క్రమంలో ఆడుతూ, పాడుతూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. అంతర్జాతీయ కృష్ణ తత్వ సమాఖ్య దేవాలయం. అదే ఇస్కాన్ దేవాలయంలో కనిపించే అద్భుత దృశ్యమిది.
అంతర్జాతీయ కృష్ణ తత్వ సమాఖ్య దేవాలయం వ్యవస్థాపకుడైన అభయ్ చరణారవింద భక్తివేదాంత స్వామి ప్రభుపాద 1896వ సంవత్సరంలో కలకత్తాలోని ఒక వైష్ణవ కుటుంబంలో జన్మించారు. తన ఆధ్యాత్మిక గురువైన శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి గోస్వామిని తొలిసారిగా 1922వ సంవత్సరంలో కలకత్తాలో కలుసుకున్నారు. అభయ్ పట్ల ప్రత్యేక దృష్టిని కనపరిచిన భక్తిసిద్ధాంత సరస్వతి, ఆయనను వేద విజ్ఞానాన్ని బోధించే వృత్తిని చేపట్టవలసిందిగా సూచించారు. మరీ ముఖ్యంగా పాశ్చాత్యులకు శ్రీకృష్ణ సందేశాన్ని బోధించవలసిందిగా భక్తిసిద్ధాంత సరస్వతి కోరారు.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గురువు సూచించిన మార్గంలో పయనించే క్రమంలో 1959వ సంవత్సరంలో అభయ్ సన్యాస దీక్షను స్వీకరించారు. శ్రీకృష్ణ తత్వాన్ని పదుగురికి పంచే క్రమంలో ఆయన పూర్తి కాలాన్ని వెచ్చించసాగారు. 1966వ సంవత్సరంలో అంతర్జాతీయ కృష్ణ తత్వ సమాఖ్య (ఇస్కాన్)ను ఆయన నెలకొల్పారు. అనంతర కాలంలో ప్రపంచ వ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించిన ఇస్కాన్ 10,000 దేవాలయ భక్తులు మరియు 2,50,000 మంది భక్త సమూహాన్ని సంతరించుకున్నది. భగవద్గీత మరియు పురాతన పురాణాలను అనుసరించి కృష్ణ తత్వ ప్రచారమే లక్ష్యంగా ఈ మహోద్యమం ప్రజలలోకి చేరుతున్నది.
|