అంతే... నది ఒడ్డుకు వెళ్లి స్వామివారు చెప్పిన ప్రదేశంలో భూమిని తవ్వటం మొదలుపెట్టాడు. ఇలా తవ్వుతుండగానే కొంతదూరంలో వరాహ విగ్రహం బయటపడింది. విగ్రహాన్ని చూసిన గ్రామస్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. తాము కూడా స్వామివారి విగ్రహాన్ని వెలికి తీయడానికి తవ్వకాలు మొదలుపెట్టారు. అలా 25 అడుగుల లోతువరకూ తవ్విన పిమ్మట సుమారు నాలుగున్నర అడుగులు ఎత్తున్న స్వామివారి విగ్రహం భక్తులకు దర్శనమిచ్చిందట. ఆ విగ్రహాన్ని భక్తులందరూ కలిసి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు. అయితే స్వామివారిని వెలికితీసే ప్రక్రియలో గునపంతో తవ్వుతుండగా పొరపాటున విఠలేశ్వరుని విగ్రహం ముక్కుపై గునపపు గాటుపడిందట. దాంతో స్వామివారి విగ్రహం ముక్కు నుంచి రక్తం కారడం మొదలైందట. ఇది మహా అద్భుతమైన విషయమని చెపుతారు. ఈ విగ్రహపు మరో ప్రత్యేకం ఏమిటంటే... విష్ణు, విఠలుడు, బాలాజీ.. ఇలా మూడు రకాలుగా ఈ విగ్రహం గోచరిస్తుంది. ఈ కారణం చేతనే ఈ విగ్రహానికి త్రివిక్రమ స్వామివారనే పేరు వచ్చింది. అంతేకాదు సమయాన్నిబట్టి ఆ విగ్రహం తన స్వరూపాన్ని మార్చుకుంటుందని భక్తుల విశ్వాసం. విఠలేశ్వరునితోపాటు ఆయన వాహనం వరాహాన్ని కొలిచినవారు పుట్టెడు దుఃఖాల నుంచి విముక్తి పొందగలరు. అంతేకాదు ఎటువంటి సమస్యలనుంచైనా తన భక్తులను దరిచేర్చుతాడు విఠలేశ్వరుడు. కడోగి సన్యాసులవారు ప్రతి ఏడాది కార్తీక శుద్ధ ఏకాదశినాడు త్రివిక్రమ స్వామివారికి రథయాత్ర ఉత్సవాన్ని నిర్వహించేవారు. అలా ఆనాడు ఆయన ప్రారంభించిన రథోత్సవం నేటికీ కొనసాగుతూనే ఉన్నది. సుమారు 25 అడుగులు ఎత్తున్న ఈ రథం 263 ఏళ్లనాటిదని చెపుతారు. అయినా స్వామివారిని ఊరేగించేందుకు ఈ రథం పనిచేస్తూనే ఉంది. ఈ రథోత్సవానికి ప్రతి ఏటా పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతుంటారు.ఎలా వెళ్లాలి?రోడ్డు ద్వారా: జల్గోన్ జిల్లాలోని జామ్నర్ పట్టణానికి త్రివిక్రమ ఆలయం 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు ద్వారా: జల్గోన్ ప్రధాన రైలు జంక్షన్. ఇక్కడ నుంచి షెండూర్ని గ్రామం సుమారు 45 కిలో మీటర్ల దూరంలో ఉంది. విమానం ద్వారా: ఔరంగాబాద్ సమీప విమానాశ్రయం. ఔరంగాబాద్ నుంచి షెండూర్ని 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. |