శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. క్రైస్తవ
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 3 జులై 2018 (13:58 IST)

యేసుక్రీస్తు మహిమలు గురించి.....

యేసుక్రీస్తు ఓసారి యెరూషలేము దేవాలయానికి వెళ్లాడు. అప్పుడు అక్కడున్న ప్రజలు దేవాలయపు రాళ్లు చూడండి, అక్కడి అలంకరణలు చూడండి అంటూ దేవాలయ సౌందర్యాన్ని ప్రభువుకు వర్ణించి చెబుతున్నారు. దేవాలయ గొప్పదనాన్ని

యేసుక్రీస్తు ఓసారి యెరూషలేము దేవాలయానికి వెళ్లాడు. అప్పుడు అక్కడున్న ప్రజలు దేవాలయపు రాళ్లు చూడండి, అక్కడి అలంకరణలు చూడండి అంటూ దేవాలయ సౌందర్యాన్ని ప్రభువుకు వర్ణించి చెబుతున్నారు. దేవాలయ గొప్పదనాన్ని దేవునికే వర్ణించి చెబుతున్న కొందరు భక్తుల సాహసమిది. కాని దేవాలయం ఎంత గొప్పదైనా, అందమైనదైనను దేవాలయం దేవునికన్నా గొప్పదెలా అవుతుంది.
 
ఈ దేవాలయమంతా ధ్వంసమై పాడుదిబ్బగా మారే రోజొకటి రాబోతుంది. అప్పుడు ఇంత అద్భుతమైన రాళ్లూ ఒకదాని మీద మరొకటి నిలవకుండా పడదోయబడుతాయని ప్రవచనం చెప్పాడు. ఆ తరువాత దాదాపు 45 ఏళ్లకు అంటే క్రీస్తుశకం 70లో టైటస్ అనే రోమా చక్రవర్తి దేవాలయన్నంతా ధ్వంసం చేశాడు. దేవాలయ నిర్మాణంలో భక్తి కొద్ది రాయికీ మధ్య బంగారాన్ని కరిగించి నింపగా టైటస్ చక్రవర్తి ఒక్కొక్క రాయిని తొలగించి రాళ్లమధ్యలో ఉన్న బంగారాన్నంతా వెలికితీయించి దోచుకుపోయాడు.
 
యేసు చెప్పిన మాటలు అలా అక్షరాలా నెరవేరాయి (లూకా 21:5–9). దైవకుమారుడైన యేసు సౌందర్యాన్ని ఆస్వాదించగా ఆయన సృష్టించేదీ, ఆస్వాదించేదీ బాహ్యసౌందర్యాన్ని కాదు, ఆత్మసౌందర్యాన్ని. ఇది జరగడానికి ముందు ఆయన దేవాలయంలో కానుకల పెట్టె దగ్గర కూర్చొని అందులో పెద్దమొత్తాల్లో కానుకలు వేసి అక్కడి యాజకుల ద్వారా గొప్పదాతలుగా ప్రకటనలు చేయించుకుంటున్న చాలామంది భక్తుల డాబూదర్పాన్ని, వేషధారణను, పైకి ఎంతో గౌరవంగా కనిపిస్తున్నా ఆంతర్యంలో గూడుకట్టుకొని ఉన్నవారి మాలిన్యాన్ని, పాపపు కంపును ఆయన అర్థం చేసుకున్నాడు.
 
అంతలో ఒక పేద విధవరాలు తన వద్ద ఉన్న రెండే రెండు కాసులను ఎంతో రహస్యంగా వేసి నిశ్శబ్దంగా వెళ్లిపోగా ఆమె ఆత్మసౌందర్యం, అంతరంగంలో దేవుడంటే ఆమెకున్న ప్రేమ యేసును ముగ్ధుణ్ణి చేసింది. ఆమె అందరికన్నా అధికంగా కానుక వేసిందని అయినా తమ సమృద్ధిలో నుండి దేవునికి అర్పిస్తే తానే లేమిలో ఉండి కూడా ఆమె తనకు కలిగినదంతా దేవునికిచ్చిందని ప్రభువు శ్లాఘించాడు (లూకా 21:1–4). భక్తులకు ఆయన శిష్యులకు దేవాలయపు రాళ్లలో, అలంకరణల్లో సౌందర్యం కనిపిస్తే, యేసుకు ఒక పేద భక్తురాలి త్యాగంలో ఆమె వేసిన చిరుకానుకలో ‘ఆత్మసౌందర్యం’ కనిపించింది.
 
గొప్ప కానుకలు వేసిన వారికి యాజకుల మన్ననలు, మెప్పు లభిస్తుంది. రెండే కాసులు వేసిన పేద విధవరాలికి ఏకంగా దేవుని ప్రశంసే లభించింది. గొప్ప కానుకలు వేసిన భక్తులు, వారిని ప్రశంసించిన యాజకులు కాలక్రమంలో చనిపోయారు, దేవాలయమే కొంతకాలానికి ధ్వంసమైంది. కాని ఆ పేద విధవరాలి చిన్న కానుక మాత్రం క్రీస్తు ప్రశంస కారణంగా చరిత్రపుటల్లోకెక్కి ఇన్నివేల ఏళ్ళుగా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. దేవుణ్ణి మెప్పించేది అనిత్యమైన కానుకలు కాదు, శాశ్వతమైన ఆత్మసౌందర్యమన్నది మరోసారి రుజువైంది.