శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2020 (19:58 IST)

నివర్‌తో ముగిసిపోలేదు... వెంటాడుతున్న మరో రెండు తుఫాన్లు!!

అయితే, నివర్ తుఫాను కాస్త శాంతించిందని అనుకున్న సమయంలోనే ఇపుడు మరో రెండు తుఫాన్లు పుట్టుకొచ్చాయి. వాతావరణ శాఖ చెబుతున్న వివరాల ప్రకారం ఈ సీజన్‌లో నివర్ చివరిది కాదని తెలుస్తోంది. నివర్ తర్వాత మరో రెండు తుఫానులు రాబోతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
 
ఈ నెల 29న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ విభాగం వెల్లడించింది. ఇది బలపడి డిసెంబరు 2న తుఫాను మారుతుందని, తుఫానుగా మారితే దీన్ని 'బురేవి' అని పిలుస్తారని తెలిపింది. ఇది తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపనుందని అంచనా వేస్తున్నారు.
 
ఇక, మరో తుఫాను పేరు 'టకేటి'. మధ్య బంగాళాఖాతంలో డిసెంబరు 5వ తేదీన ఏర్పడే అల్పపీడనం బలపడి వాయుగుండంగా, ఆపై తుఫానుగా మారితే దాన్ని 'టకేటి' అని పిలవనున్నారట. 
 
టకేటి ప్రభావంతో డిసెంబరు 7న దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం ఉంటుందని వాతావరణ విభాగం వెల్లడిస్తోంది. మొత్తంమీద ఆగస్టు నుంచి డిసెంబరు వరకు బంగాళాఖాతంలో తుఫానుల సీజన్ నడుస్తుందని చెప్పొచ్చు. ఈసారి సీజన్ ముగిసే సమయానికి తుఫాన్లు అల్లకల్లోలం సృష్టించేలా కనిపిస్తున్నాయి.