శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (20:06 IST)

కత్తులు దూస్తున్న తండ్రీకుమార్తె... రసవత్తరంగా రాజవంశీయుల రాజకీయం

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని కురుపాం రాజవంశానికి చెందిన వైరిచర్ల కుటుంబం మరోసారి నిరూపిస్తోంది. ఈ కుటుంబానికి చెందిన తండ్రీ, తనయలు అరకు లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులుగా పోటీ పడుతుండటమే దీనికి నిదర్శనం. 
 
ఎందుకంటే అరకు లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కిశోర్‌ చంద్రదేవ్‌ పోటీ చేయనున్నారు. నాలుగు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌(ఎస్‌)లోనూ అనంతరం కాంగ్రెస్‌(ఐ)లో ఆయన ఢిల్లీస్థాయిలో కీలక పాత్ర పోషించారు.
 
తాజాగా ఆయన టీడీపీలో చేరారు. అయితే బద్ధవ్యతిరేక తెలుగుదేశం పార్టీలో చేరడం ఆయన కుమార్తె శృతీదేవికి ఏమాత్రం నచ్చలేదు. తాను కాంగ్రెస్‌ పార్టీలోనే  కొనసాగుతానని ఆమె తేల్చిచెప్పారు. అంతేకాదు కాంగ్రెస్‌ అరకు ఎంపీ టికెట్‌ కోసం దరఖాస్తు కూడా చేశారు. తండ్రి కోసం శృతీదేవి వెనక్కి తగ్గుతారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఆమె మాత్రం తన నిర్ణయానికి కట్టుబడ్డారు. 
 
అదేసమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో కిశోర్‌ చంద్రదేవ్‌కు స్థానం కల్పించారు. అదేవిధంగా కాంగ్రెస్‌ విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో శృతీదేవికి అరకు ఎంపీ టికెట్టును కేటాయించారు. అంటే తండ్రి టీడీపీ అభ్యర్థిగా తనయ కాంగ్రెస్‌ అభ్యర్థిగా టికెట్లు దక్కించుకున్నారు. 
 
కురుపాం రాజకుటుంబంలోని రాజకీయ వైచిత్రి సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సాధారణ గిరిజన కుటుంబానికి చెందిన గొడ్డేటి మాధవిని తమ అభ్యర్థిగా ప్రకటించడంపట్ల సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది.