మరో రెండేళ్లు స్థానికత గడువు పెంపు
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి ఏపీ తరలివచ్చే వారి స్థానికత విషయంలో ఇప్పటి వరకూ ఉన్న ఐదేళ్ల గడవును మరో రెండేళ్లు పెంచుతూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కానందున ఏపీ విజ్ఞప్తి మేరకు హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2021 జూన్ 2 లోపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారికి స్థానికత కల్పిస్తారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చే వారికి స్థానికత కల్పించడానికి ఇప్పటివరకూ ఉన్న ఐదేళ్ల గడువును మరో ఏడేళ్లకు పెంచుతూ కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన 2014 జూన్ 2 నుంచి ఏడేళ్లలోపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చిన వారు అక్కడ స్థానికత పొందడానికి వీలుంటుంది. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లయిన తర్వాతా ఇప్పటికీ వివిధ పోలీసు కేడర్‌తోపాటు, షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన అంశం కొలిక్కిరాకపోవడం వలన ఏపీకు చెందిన చాలామంది తెలంగాణలో ఉంటున్నారు.
ఈ సమస్య పరిష్కరించేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నందున.. మరో రెండేళ్లపాటు గడువు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రహోంశాఖ మన్నించి.. ఆ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. తొలి ఉత్తర్వుల ప్రకారం 2017 జూన్ 2వరకూ గడువు విధించారు. తర్వాత రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తితో 2019 జూన్ వరకు పొడిగించారు.
తాజాగా మరో రెండేళ్లు పెంచారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 2021 జూన్ 2లోపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి తరలివచ్చి ఏ ప్రాంతంలో స్థిరపడితే ఆ స్థానికతను కల్పించి విద్యా, ఉద్యోగావకాశాల్లో తగిన ప్రాధాన్యం ఇస్తారు.