నరసాపురంలో నాగబాబుకు ''కాపు" కాసేనా?

nagababu
Last Updated: ఆదివారం, 24 మార్చి 2019 (11:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభతో పాటు.. లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వెస్ట్ గోదావరి జిల్లా నరసాపురం నుంచి మెగా బ్రదర్ నాగబాబు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే, రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉంటే కేవలం నరసాపురంను మాత్రమే ఆయన ఎందుకు ఎంచుకున్నారన్న అంశంపై రసవత్తర చర్చసాగుతోంది.

దీనికి బమైన కారణం లేకపోలేదు. ఈ సెగ్మెంట్‌లో కాపు ఓటర్లు అధికంగా ఉన్నారు. నాగబాబు కూడా ఇదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. దీనికితోడు మెగా ఫ్యాన్స్ బలంగా ఉన్న ఏరియా. వీరంతా అండగా నిలుస్తారన్నది నాగబాబు భావన. పైగా, టీడీపీ, వైసీపీ మధ్య ఇతర ఓటర్లు చీలిపోయి తమకు కలిసొస్తుందన్న జనసేన అంచనా వేస్తోంది.

తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన జనసేనాని.. ఏరికోరి కాపుల ఓట్లు గణనీయంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానాలనే ఎంపిక చేసుకున్నారు. 13 జిల్లాలున్న నవ్యాంధ్రలో ఒకేసారి రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించడం ఓ విచిత్రమైతే.. విశాఖ, ఆ పక్కనే ఉండే గోదావరి జిల్లాల నుంచే రెండు స్థానాలను ఎంపిక చేసుకోవడం విశేషం.

పవన్ పోటీ చేస్తున్న భీమవరం కూడా ఈ లోక్‌సభ పరిధిలోకే వస్తుంది. దీంతో తన ఫాలోయింగ్ కూడా అన్న విజయానికి తోడ్పడుతుందని పవన్ భావించారు. మెగా బ్రదర్స్ పశ్చిమ గోదావరి జిల్లానే ఎంపిక చేసుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. అందులో ఒకటి కాపు కమ్యూనిటీ, రెండు ఫ్యాన్స్. జిల్లాలో కాపు ఓటు బ్యాంకు పెద్ద సంఖ్యలో ఉండటంతో తమకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు.

కాపు ఓటర్ల తర్వాత బీసీ, క్షత్రియ సామాజిక వర్గాల ఓటర్లు ఎక్కువ. భీమవరంలో కాపు ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అక్కడ 2004 నుంచి వరుసగా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. భీమవరంలో పవన్ కల్యాణ్‌కు కొండంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అది కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. మొత్తానికి కాపులు, అభిమానులు మెగా బ్రదర్స్‌ను గట్టెక్కిస్తారో లేదో చూడాలి.దీనిపై మరింత చదవండి :