1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 26 మార్చి 2024 (07:23 IST)

30 నుంచి జనసేనాని పిఠాపురంలో ఎన్నికల ప్రచారం...

pawan kalyan
ఈ నెల 30వ తేదీ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం ఆయన తన వారాహి వాహనాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తం మూడు రోజుల పాటు అక్కడే ఉండి ప్రచారం చేసేలా ఆయన తన షెడ్యూల్‌ను ఖరారు చేసుకున్నారు. అక్కడ నుంచే రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని, అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్ రూపొందించాలని నేతలకు పవన్ సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మూడు విడతలుగా పవన్ కళ్యాణ్ తన ప్రచారం చేయనున్నారు. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా ప్రచార షెడ్యూల్‌ను రూపొందించనున్నారు. 
 
పిఠాపురం వెళ్లిన తొలిన రోజున ఆయన శక్తిపీఠమైన శ్రీపురూహుతిక అమ్మవారిని పవన్ దర్శనం చేసుకుంటారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసిన అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు. ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు ఆయన నియోజకవర్గంలోనే ఉంటారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. కూటమి భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, బీజేపీ నేతలతో పాటు.. జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో కూడా ఆయన సమావేశమవుతారు. అలాగే, పిఠాపురం నియోజకవర్గంలో బంగారు పాప దర్గా సందర్శన, క్రైస్తవ మత పెద్దలతో కూడా ఆయన సమావేశమై, సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు. ఉగాది వేడుకలను సైతం పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే నిర్వహించుకోనున్నారు.