సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 ఏప్రియల్ 2024 (10:02 IST)

పవన్ కల్యాణ్‌తో సంసారం చెయ్... అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది : సీఎం జగన్‌కు చంద్రబాబు సలహా

Chandrababu
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ల గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదేపదే చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనదైనశైలిలో సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ మూడు వివాహాలు చేసుకున్నారని చేసుకోని నాలుగో పెళ్లి గురించి జగన్ పదే పదే చెబుతున్నారన్నారు. అందుకే పవన్‌కు మండిందని, ఫలితంగా తన నాలుగో పెళ్లాం జగనే అని చెప్పారని చంద్రబాబు మరోమారు గుర్తుచేశారు. తిరుపతి జిల్లా సత్యవేడులో చంద్రబాబు ప్రజాగళం సభ నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... నీ తాత జాగీరు అని రాష్ట్రంలో దోపిడీ చేస్తున్నావా? నువ్వు దోచుకుంటే ప్రశ్నించకూడదా? అంటూ సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే పరారవుతారు వీళ్లు... ఆ తిరుగుబాటు సత్యవేడు నుంచి ప్రారంభించాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 
 
'అసెంబ్లీ సాక్షిగా బూతులు తిడతారు. ఎవడైతే ఎక్కువ బూతులు తిడతాడో వాడికి మంత్రి పదవి! ఇంకా ఎక్కువ బూతులు తిడితే వాడికి ప్రమోషన్! నా మీద దాడి చేయించిన వాడికి ఒక మంత్రి పదవి! నా మిత్రుడు పవన్ కల్యాణ్‌‍పై దాడి చూశారా? పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తే నీకెందుకంత కడుపుమంట? ఒక నీతి నిజాయతీతో రాష్ట్రం కోసం ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కల్యాణ్... ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, కూటమి ఏర్పడాలని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కల్యాణ్. అలాంటి వ్యక్తిని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? 
 
రాష్ట్రమంతా దోచేసిన నువ్వా ఆయనపై అవినీతి ఆరోపణలు చేసేది? నువ్వు ఆయన కాలి గోటికి కూడా సరిపోవు. ఇవాళ పవన్ ఒక సినిమాలో నటిస్తే డబ్బులు ఇస్తారు... సూపర్ స్టార్ ఆయన! రాజకీయాలు లేకపోతే ఈ జగన్ మోహన్ రెడ్డి ఒక్క నయా పైసాకు పనికొస్తాదా? ఏదైనా ఒక్క పని చేసే సత్తా ఉందా నీకు? నువ్వు ఆయన పెళ్లాల గురించి మాట్లాడతావా? అందుకే ఆయన అన్నాడు... ఓకే, నువ్వు కూడా రారా నీతో కూడా సంసారం చేస్తానన్నాడు. సిగ్గున్న వాడైతే జగన్ మోహన్ రెడ్డి మాట్లాడతాడా? అందుకే అంటున్నా... వెళ్లి పవన్ కల్యాణ్‌తో సంసారం చెయ్... అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది" అంటూ చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 
కాగా, పవన్ కల్యాణ్ రాజానగరం వారాహి విజయభేరి సభలో సీఎం జగన్‌‍ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అలాగే, సీఎం జగన్ శుక్రవారం కాకినాడ సభలో మాట్లాడుతూ, ప్యాకేజి స్టార్‌కు పెళ్లిళ్లే కాదు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ వ్యాఖ్యలకు పవన్ ధీటుగా కౌంటరిచ్చారు. 'పరదాల మహారాణీ... నిన్న నాతో చాలామంది చెప్పారు. సార్ నిన్న మీ నాలుగో పెళ్లానికి చాలా అవమానం జరిగిందని చెప్పారు. నువ్వు నా గురించి పెళ్లాం అని మరోసారి మాట్లాడితే, జగన్ నా నాలుగో పెళ్లాం అని జనాలు మాట్లాడతారు జాగ్రత్త!' అంటూ వార్నింగ్ ఇచ్చారు.