సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By వరుణ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : గాజు గ్లాసుపై మళ్లీ పేచీ!

glass tumbler
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసిపోటీస్తున్నాయి. టీడీపీ సైకిల్ గుర్తుపై, జనసేన గాజు గ్లాసుపై బీజేపీ కమలం గుర్తులపై పోటీ చేస్తున్నాయి. అయితే, జనసేన పార్టీ కేవలం 21 అసెంబ్లీ, 2 లోక్‌‍సభ స్థానాల్లోనే పోటీ చేస్తున్నాయి. దీంతో ఆ పార్టీకి గాజు గ్లాసును ఎన్నికల సంఘం కేటాయించింది. అయితే, ఈ పార్టీ పోటీ చేస్తే స్థానాల్లో మినహా మిగిలిన నియోజకవర్గాల్లో గాజు గ్లాసులు కామన్ సింబల్‌గా పరిగణించి స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించేలా అందుబాటులో ఎన్నికల సంఘం ఉంచింది. ఈ నిర్ణయం ఆ కూటమికి పెద్ద చిక్కుగా మారింది. జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థులకు కూడా అందుబాటులో ఉంచడం తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. 
 
జనసేనకు గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా ఇవ్వడాన్ని హైకోర్టు అనుమతించింది. కానీ ఆతర్వాత మరో సమస్య వచ్చి పడింది. ఆ పార్టీ పోటీ చేస్తున్న చోట మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయిస్తారు. ఆ పార్టీ అభ్యర్థులు లేనిచోట స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా కోరుకుంటే వారికి ఈ గుర్తు ఇచ్చే అవకాశం ఉంది. ఇండిపెండెంట్లు కోరుకోవడానికి వీలుగా కొన్ని గుర్తులను ఫ్రీ సింబల్స్ పేరిట ఎన్నికల కమిషన్ ముందే ప్రకటించింది. అందులో గాజు గ్లాసు గుర్తు ఉంది. జనసేన అభ్యర్థులు లేనిచోట్ల స్వతంత్ర అభ్యర్థులు అడిగితే ఈ గుర్తు కేటాయిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం స్పష్టం చేసింది. 
 
కూటమిలో భాగస్వామిగా జనసేన 21 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లకు పోటీ చేస్తోంది. మిగిలినచోట్ల ఆ పార్టీ మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీ బరిలో ఉన్నాయి. జనసేన అభ్యర్థులు లేనిచోట గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తే తాము నష్టపోతామని ఈ రెండు పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ గుర్తు చూసి స్వతంత్ర అభ్యర్థులకు ఓట్లు వేస్తే తమకు రావలసిన ఓట్లు తగ్గిపో తాయని అంటున్నారు. ఈ పార్టీలకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ.. జనసేన పోటీ లేని స్థానాల్లో తమకు కావలసిన వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయించి, వారికి గాజు గ్లాసు గుర్తు వచ్చేలా చేసే అవకాశం ఉందని టీడీపీ నేత ఒకరు చెప్పారు.
 
ఇదే జరిగితే సంక్లిష్ట సమస్యలు వస్తాయని కూటమి నేతలు అంటున్నారు. 'కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వాళ్లు తమ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ప్రచారం చేసుకుంటారు. అదే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో టీడీపీ, జనసేన పోటీచేసే అసెంబ్లీ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు వస్తే పరిస్థితి ఏమిటి? ఓటర్లకు ఇది అయోమయం కలిగించదా? కూటమి ఓట్లు చెదిరిపోవా' అని ఒక నాయకుడు ప్రశ్నించారు. ఈ సమస్యను ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి జనసేన నాయకులు తీసుకెళ్లారు. నిర్ణయం వెలువడాల్సి ఉంది. స్వతంత్ర అభ్య ర్ధులకు అందుబాటులో ఉంచిన గుర్తుల నుంచి గాజు గ్లాసును తీసేస్తే సమస్య పరిష్కారమవుతుందని వారు అంటున్నారు.