శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 ఏప్రియల్ 2024 (09:01 IST)

వైఎస్ఆర్‌కు పుట్టలేదా? జగన్మోహన్ రెడ్డి పులి.. కాదు పిల్లి : వైఎస్ షర్మిల

Sunitha-Sharmila
తాను వైఎస్ఆర్‌కు పుట్టలేదని తన అన్న వైఎస్ జగన్ సారథ్యంలోని వైకాపా నేతలు నోటికొచ్చినట్టుగా దుష్ప్రచారం చేస్తునని, తాను వైఎస్ఆర్ బిడ్డనో కాదో కడప లోక్‌సభకు పోటీ చేస్తున్న ఓటర్లే తేల్చాలని ఏపీ పీసీసీ చీఫ్ అధినేత్రి వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు. పులివెందుల జరిగిన బహిరంగసభలో ఆమె ప్రసంగిస్తూ, కొంగు చాచి అడుగుతున్నా.. న్యాయం చేయండన్నారు. కన్నీళ్లతో ఓటర్లను వేడుకుని సానుభూతిని తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో ఆమె సఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వైకాపాలో అంతర్మథనం మొదలైంది. 
 
తమకు నష్టం జరుగుతోందనే అభిప్రాయానికి ఆ పార్టీ నేతలొచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు రంగ ప్రవేశం చేసి.. షర్మిల, సునీతలపై ఎదురుదాడి చేసేందుకు వారి మేనత్త విమలారెడ్డిని రంగంలోకి దించారు. వివేకా హత్య కేసులో జగన్, అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చిన విమలారెడ్డికి షర్మిల, సునీత సుతిమెత్తగా చురకలు అంటించారు. కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన షర్మిల ఆరు రోజుల పాటు కడప పార్లమెంటు పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య అంశాన్ని ప్రచారాస్త్రంగా ఎంచుకున్నారు. 
 
వివేకా కుమార్తె సునీతతో కలిసి తనదైనశైలిలో జగన్, అవినాష్ రెడ్డిపై ఘాటైన విమర్శలు, ఆరోపణలు సంధించడంతో పార్టీ శ్రేణుల్లో, కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఐదేళ్ల కిందట జరిగిన వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ స్పష్టం చేస్తున్నా ఎందుకు జైలుకు పంప లేదనే వారి ప్రశ్నలకు సమాధానాలు లేకపోయాయి. ప్రతి సభలోనూ ఇదే అంశం ప్రస్తావన చేయడంతో ప్రజల్లో చర్చ మొదలైంది. మీ రాజన్న బిడ్డ కావాలో.. రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని చంపించిన అవినాష్ రెడ్డి కావాలో తేల్చుకోవాలని పిలుపునివ్వడం ఓటర్లు ఆత్మపరిశీలనలో పడ్డారు. 
 
షర్మిల, సునీతపై వైకాపా నాయకులు కొందరు విమర్శలు చేసినా.. ప్రజలు పట్టించుకోకపోవడంతో చివరకు వారి మేనత్తను రంగంలోకి దింపారు. వైయస్ఆర్, వివేకాల సోదరి విమలారెడ్డిని మీడియాతో మాట్లాడించి షర్మిల, సునీతపై విమర్శలు చేయించారు. పులివెందులలో తమ కుటుంబ ఆడపడుచులు ఇద్దరూ కొంగు చాచి ఓట్లు అడుగుతుంటే రక్తపోటు పెరిగిపోయిందని విమలారెడ్డి అన్నారు. వివేకాను ఎవరు చంపారో వాళ్లు చూశారా?.. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిపై నిందలు వేశారంటూ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. స్వయానా అన్న వివేకాను చంపేస్తే.. సానుభూతి చూపించకుండా... న్యాయ కోసం పోరాడుతున్న అక్కాచెల్లెళ్లపైనే మాటల దాడి చేస్తారా? అంటూ సునీత, షర్మిల నిలదీశారు. 
 
జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో శనివారం బస్సుయాత్ర కొనసాగింది. జమ్మలమడుగు పర్యటనలో ఇద్దరూ స్పందించారు. కనీసం కృతజ్ఞత లేకుండా జగన్ దగ్గర పొందుతున్న లబ్ధి కోసం తమపై మాట్లాడుతున్నారని విమర్శించారు. వైకాపా నాయకులైనా.. కుటుంబ సభ్యులైనా విమర్శిస్తే ఏమాత్రం తగ్గకుండా షర్మిల, సునీత వారికి ఘాటుగా ధీటుగా బదులిస్తుండడం అధికార పార్టీ నేతలకు మింగుడుపడడంలేదు. ఆరు రోజుల బస్సుయాత్రను ముగించుకుని తిరుపతి, చిత్తూరు జిల్లాల పర్యటనకు వెళ్లారు. వివేకా కుమార్తె సునీత ఎన్నికల వరకు జిల్లాలోనే ఉంటూ షర్మిల తరపున విస్తృతంగా పర్యటించనున్నారు.