కామెర్లకు చికిత్స చేయమని ఆస్పత్రికి తీసుకెళ్తే శిశువును మాయం చేశారు...
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఓ దారుణం జరిగింది. కామెర్లకు చికిత్స చేయమని ఓ శిశువును తీసుకెళ్తే ఆస్పత్రి సిబ్బంది ఆ బిడ్డను మాయం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
సంగారెడ్డి జిల్లాలోని కల్పగూర్ గ్రామానికి చెందిన హన్మోజిగారి మాధవి (28) అనే మహిళ గత నెల 30వ తేదీన ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 3వ తేదీన బిడ్డకు పచ్చకామెర్లు రావడంతో తిరిగి ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు శిశువును ఎస్‌ఎన్‌సీయూలో ఉంచారు.
ఈ క్రమంలోమంగళవారం ఉదయం గుర్తుతెలియని మహిళ ఎస్‌ఎన్‌సీయూలోకి వచ్చింది. అక్కడే ఉన్న ఆయా వనిత ఆమెను మాధవిగా భావించి బిడ్డను ఆమెకు అప్పగించింది. ఆ తర్వాత కాసేపటికి తన బిడ్డ వద్దకు తల్లి మాధవి వెళ్ళగా, పడకపై బిడ్డ కనిపించలేదు. దీంతో ఆయాను ప్రశ్నించగా, ఇపుడే కదా మీకు బిడ్డకు అప్పగించాను అని చెప్పడంతో తల్లి మాధవి ఖంగుతిన్నారు.
ఆయా వనిత నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మాయమైందని మాధవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. వారు ఆగ్రహానికి గురై ఆస్పత్రిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆసుపత్రిలోని ఆర్‌ఎంఓ ఛాంబర్‌లో సీసీ ఫుటేజీలను పరీక్షించగా బిడ్డను ఓ గుర్తు తెలియని మహిళ బయటకు తీసుకెళ్తున్నట్టు రికార్డైంది. జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయా వనితను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.