విజయనగరం జిల్లాలో రైలు పట్టాలపై ఘోరం.. 14కు పెరిగిన మృతుల సంఖ్య
విజయనగరం జిల్లాలో రైలు పట్టాలపై ఘోరం జరిగింది. సిగ్నల్ కోసం ఆగివున్న రైలును మరో ప్యాసింజర్ రైలు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 14కు చేరింది. మరికొందరు గాయపడ్డారు. వీరిలో పలువురి ఆరోగ్యం విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి - అలమండ ప్రాంతాల మధ్య ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విశాఖపట్టణం - పలాస ప్రాంతాల మధ్య నడిచే ప్యాసింజర్ రైలును వెనుక నుంచి వచ్చిన విశాఖ - రాయగడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు చెబుతున్నా వారి సంఖ్య వందకుపైనే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదంలో రాయగడ రైలు బోగీలు నుజ్జయ్యాయి. మరో ట్రాక్‌పై ఉన్న గూడ్సురైలు బోగీలపై దూసుకెళ్లాయి.
రైళ్ల ఢీ ఘటనతో ఒక్కసారిగా అక్కడ భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికులు రైలు దిగి భయంతో పరుగులు తీశారు. చిమ్మచీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. సిగ్నల్ కోసం వేచివున్న పలాస ప్యాసింజర్ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన రాయగడ రైలు ఢీకొట్టినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ యేడాది జూన్ నెలలో ఒరిస్సా రాష్ట్రంలోని బాలేశ్వర్ రైలు ప్రమాద ఘటనను ఇది తలపించింది.
రెండు ప్యాసింజర్ రైళ్లు, గూడ్సు రైలులో కలిపి మొత్తం ఏడు బోగీలు నుజ్జయ్యాయి. రాయగడ రైలులోని దివ్యాంగుల బోగీ పట్టాలు తప్పి పొలాల్లో పడింది. రెండు ప్యాసింజర్ రైళ్లలోనూ కలిపి దాదాపు 1400 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య 40 నుంచి 50 వరకు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అర్థరాత్రి వరకు 10 మృతదేహాలను వెలికి తీశారు.