శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (07:58 IST)

భీమడోలులో వింత వ్యాధి ... ఉన్నట్టుండి పడిపోతున్న ప్రజలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో ఓ వింత వ్యాధి వెలుగు చూసింది. ఈ ప్రాంత వాసులు ఉన్నట్టుండి ఠపీమని కిందపడిపోతున్నారు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 
 
ఈ మండలంలోని పూళ్ల గ్రామంలో కొంతమంది ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు. అలా మొత్తం 16 మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులు కొందరిలో మూర్ఛ లక్షణాలు కూడా కనిపించడంతో ఏలూరు ఘటనను ఇది గుర్తుకు తెచ్చింది. 
 
బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆహారం విషతుల్యం కావడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
 
కాగా, ఇటీవల గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలోనూ ఇలానే జరిగింది. స్థానికులు కొందరు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. సమీపంలోని రసాయన పరిశ్రమ అర్ధరాత్రి విడిచిపెట్టే వ్యర్థాల వల్లే ఇలా జరిగిందని తేలింది. 
 
అలాగే, తెలంగాణలోని మహబూబాబాద్ మండలం అయోధ్య శివారు భజనతండాలోనూ ఇలాంటి వింత వ్యాధి కొన్ని రోజులపాటు స్థానికులను వణికించింది. వాంతులు, విరేచనాలతో 130 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు.