శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (12:41 IST)

ఏపీలో పల్లె పోరు : మూడో దశలో 579 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు సాగుతోంది. ఇప్పటికే రెండు దశల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన మూడో దశ పోలింగ్ జరుగనుంది. అయితే, ఈ పోలింగ్‌కు ముందే మూడో విడత ఎన్నికల్లో 579 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 

ఈనెల 17న జరిగే మూడో విడత ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది. 160 మండలాల్లో మొత్తం 3,221 సర్పంచ్‌, 31,516 వార్డు స్థానాలకు మూడో విడతలో ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. అందులో 579 సర్పంచ్‌, 11,732 వార్డు స్థానాలు ఏకగ్రీవమైనట్టు ఎస్ఈసీ ప్రకటించింది. 

మిగిలిన 2,640 సర్పంచ్‌ స్థానాలకు, 19,607 వార్డులకు మూడో దశలో ఎన్నికలు జరుగనున్నాయి. ఆ స్థానాల్లో సర్పంచ్‌కు 7,756 మంది, వార్డులకు 43,282 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏకగ్రీవం అయిన సర్పంచ్‌ స్థానాలు శ్రీకాకుళంలో 45, విజయనగరం 37, విశాఖ 6, తూర్పుగోదావరి 14, పశ్చిమగోదావరి 14, కృష్ణా 29, గుంటూరు 98, ప్రకాశం 62, నెల్లూరు 75, చిత్తూరు 91, కడప 59, కర్నూలు 26, అనంతపురంలో 23 ఉన్నాయి.